Film Celebrities Donation to Telugu StatesAffected by Floods : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో తెలుగు రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ముఖ్యంగా తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, ఏపీలోని విజయవాడ, కృష్ణా జిల్లాల పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయి. వాగులు, వంకలు పొంగి ప్రధాన రహదారులు, కాలనీలను చెరువులుగా మార్చేశాయి. దీంతో ప్రజలు గత మూడు రోజులుగా వరద నీటిలోనే ఉంటూ, పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటూ బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. అన్నీ కోల్పోయిన తమకు కట్టుబట్టలే మిగిలాయని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పలువురు దాతలు ముందుకొచ్చి తమవంతు సాయం చేస్తున్నారు. ఎవరికి తోచినంత వారు అందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సినీ పరిశ్రమ వరద బాధితులకు అండగా నిలిచింది. హీరో జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు తమ వంతుగా వరద బాధితులకు సాయం అందించారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు రూ.కోటి విరాళంగా ప్రకటించారు. ఇరు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున విరాళం అందించారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా పోస్టు చేశారు.
జూ.ఎన్టీఆర్ రూ.1 కోటి విరాళం :తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం తనను కలచివేసిందని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అతి త్వరగా తెలుగు ప్రజలు కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయపడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణకు చెరో రూ.50 లక్షల విరాళం ప్రకటిస్తున్నట్లు జూ.ఎన్టీఆర్ వెల్లడించారు.
"రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో రూ.50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాను. - ఎన్టీఆర్ ట్వీట్