AEE Nikesh Kumar Custody Today :నీటిపారుదల శాఖలో ఏఈఈగా పనిచేస్తూ ఇటీవల ఏసీబీకి చిక్కిన నిఖేష్‌కుమార్ అక్రమ దందా వ్యవహారం తవ్వేకొద్ది బయటకొస్తుంది. అధికారుల ప్రాథమిక విచారణలో రోజుకు తక్కువలో తక్కువ రూ.2 లక్షలకుపైగా సంపాదించినట్లు గుర్తించారు. ఉద్యోగంలో చేరిన అనతి కాలంలోనే అక్రమార్జనకు అలవాటు పడిన నిఖేశ్ కుమార్‌తోపాటు సన్నిహితుల ఇళ్లపై ఏసీబీ బృందాలు చేసిన దాడిలో బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించారు. ఆయన ఉద్యోగంలో చేరి పదేళ్లవుతోంది. ఈ క్రమంలో అతడి అక్రమార్జన గురించి లెక్కగడితే సగటున రోజుకు 2లక్షలకు తక్కువ కాకుండానే ఉన్నట్లు తేలుతోంది.
రూ.17.73 కోట్ల అక్రమాస్తులు, ఒక లాకర్‌లోనే కిలోన్నర బంగారు ఆభరణాలు. వీటన్నింటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్లపైమాటే. వీటన్నింటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన స్నేహితుడి బ్యాంకు లాకర్లో ఉన్న సొత్తును కూడా అధికారులు తీసుకున్నారు. ఇది ఇటీవల ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా నీటి పారుదల ఏఈఈ అక్రమస్తుల చిట్టా. నిఖేశ్ కుమార్ భారీ అక్రమార్జనపై కూపీలాగే పనిలో ఏసీబీ అధికారులు నిమగ్నమయ్యారు. అతను మరెవరికైనా బినామీగా వ్యవహరించాడా? అనే విషయాన్నీ తేల్చే ప్రయత్నంలో ఉన్నారు. వాస్తవానికి పదేళ్ల క్రితమే నిఖేష్‌కుమార్ ఉద్యోగంలో చేరినా గండిపేట ఏఈఈగా పోస్టింగ్ వచ్చాకే అతడి అక్రమార్జన ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
ఉన్నతాధికారులపైనా ఏసీబీ నజర్ : నీటి పారుదల శాఖలో 2013లో చేరిన నిఖేష్‌కుమార్ తొలుత వరంగల్ జిల్లాలో పనిచేసి తర్వాత వికారాబాద్ జిల్లాకు బదిలీ అయ్యాడు. మూడేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లాకు వచ్చాక రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. కీలకమైన ఇబ్రహీంపట్నం, మేడ్చల్, గండిపేట ఏఈఈగా పోస్టింగ్ దక్కడంతో వసూళ్లే ధ్యేయంగా పనిచేసినట్లు సమాచారం. నాలాలు, జలాశయాల పరిధిలో ఎఫ్టీఎల్, బఫర్‌జోన్లలో అక్రమ నిర్మాణాలకు నిరభ్యంతర పత్రాలు జారీ చేయడం ద్వారా అక్రమార్జనకు పాల్పడ్డాడు. వాస్తవానికి నిరభ్యంతర పత్రం జారీ చేసే అధికారం ఏఈఈకి లేదు. అయినప్పటికీ దరఖాస్తులను ఫార్వర్డ్ చేసేందుకు, వాటిని క్లియర్ చేయించేందుకు భారీగా వసూళ్లు చేసి ఉన్నతాధికారుల తరపున వాటాలనూ సేకరించి, ముట్టజెప్పినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఉన్నతాధికారుల పాత్రపైనా ఏసీబీ ఆరా తీస్తుండటం ప్రాధాన్యం సంతరించుకొంది.
ఫ్రెండ్ లాకర్లో కిలోన్నర బంగారం, వజ్రాభరణాలు, ప్లాటినం నగలు - ఇదీ నిఖేశ్ అక్రమాస్తుల చిట్టా