తెలంగాణ

telangana

ETV Bharat / state

నా ఆదేశాలతోనే నిధులు మంజూరు - ఏసీబీ విచారణలో కేటీఆర్ కీలక విషయాలు వెల్లడి - KTR ATTEND ACB ENQUIRY

ఫార్ములా-ఈ రేసు అంశంలో ఏసీబీ ముందు హాజరైన కేటీఆర్ - సమయాభావం వల్ల అనుమతులు గురించి ఆలోచించలేదని వెల్లడి - మరోసారి విచారించాలనే యోచనలో అధికారులు!

KTR Attend ACB Enquiry in Formula E Race Case
KTR Attend ACB Enquiry in Formula E Race Case (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 10, 2025, 6:56 AM IST

Updated : Jan 10, 2025, 8:46 AM IST

KTR Attend ACB Enquiry in Formula E Race Case :ఫార్ములా ఈ రేసు నిర్వహణకు తన ఆదేశాల మేరకే నిధులు మంజూరు చేశారని మాజీ మంత్రి కేటీఆర్ అవినీతి నిరోధక శాఖ అధికారుల ఎదుట ఒప్పుకున్నారు. మంత్రి హోదాలో తన విచక్షణాధికారం ప్రకారమే నడుచుకున్నామని, సమయాభావం వల్ల అనుమతుల గురించి ఆలోచించలేదని వెల్లడించారు. ఏసీబీ ఎదుట విచారణకు హాజరైన కేటీఆర్​ను సుమారు 7 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు.

ఏ-1గా కేటీఆర్ : ప్రకంపనలు సృష్టిస్తున్న ఫార్ములా ఈ రేసు కేసులో అవినీతి నిరోధక శాఖ నిందితులను వరుసగా విచారిస్తోంది. ఏ-1గా ఉన్న కేటీఆర్ ఈ నెల 6నే విచారణకు హాజరు కావాల్సి ఉన్నా, తన న్యాయవాదులను అనుమతించలేదన్న కారణంగా అర్ధాంతరంగా వెనుతిరిగారు. అదేరోజు మరోమారు నోటీసులివ్వడంతో గురువారం ఉదయం 10 గంటలకు కేటీఆర్‌ న్యాయవాదితో కలిసి ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్న మాజిద్‌ సెలవులో ఉండటంతో జాయింట్‌ డైరెక్టర్‌ రితిరాజ్‌, డీఎస్పీ మధుసూదన్‌ విచారించారు. మంత్రిమండలి ఆమోదం లేకుండా సుమారు 55 కోట్ల రూపాయలను ఎఫ్ఈఓకు చెల్లించారని, విదేశీ సంస్థకు చెల్లింపు జరిపే ముందు ఆర్బీఐ అనుమతి తీసుకోలేదని అభియోగాలపై కేటీఆర్​ను విచారించారు.

మళ్ళీ విచారణకు రావాల్సి ఉంటుంది :ప్రధానంగా కేటీఆర్ విచారణ మొత్తం ఎఫ్​ఈఓకు నిధుల చెల్లింపుపైనే జరిగినట్లు తెలుస్తోంది. రెండోసారి రేసు నిర్వహణకు స్పాన్సర్‌గా వ్యవహరించిన ఏస్ నెక్స్ట్ జెన్ తప్పుకోవడంతో ప్రభుత్వం బాధ్యత తీసుకుందని చెప్పినట్లు తెలుస్తోంది. కొత్త స్పాన్సర్‌ను వెతికే సమయం లేకపోవడంతో హెచ్​ఎండీఏ నుంచి నిధులు మంజూరు చేశామని, తన ఆదేశాల ప్రకారమే ఇది జరిగిందని తెలిపారు. ఇందులో ఎలాంటి దురుద్దేశాలు, అవినీతి లేదని వెల్లడించారు. మంత్రిమండలి ఆమోదం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఇలా చేయడం మామూలేనని చెప్పినట్లు సమాచారం.

రేసు ద్వారా ప్రభుత్వానికి ఏయే మార్గాల్లో ఎంత ఆదాయం వచ్చిందని సైతం అధికారులు ప్రశ్నించగా, ఆ సమాచారమంతా ప్రభుత్వం వద్దనే ఉంటుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఒప్పందానికి విరుద్ధంగా రేస్ నుంచి తప్పుకున్న ఏస్ నెక్ట్స్‌ జెన్ సంస్థపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని అడగగా, ఆలోపే ఎన్నికలు వచ్చాయని, తర్వాత ప్రభుత్వం మారడంతో తమ చేతుల్లో లేకుండా పోయిందని కేటీఆర్ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇదే కేసులో అర్వింద్‌ కుమార్‌ సైతం ప్రశ్నించిన ఏసీబీ అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని తెలిపారు.

రేసును హైదరాబాద్‌లో నిర్వహించి రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచాలనే, ఉద్దేశంతోనే ఫైలు పైన సంతకం పెట్టినట్లు కేటీఆర్ ఏసీబీకి తెలిపారు. ఐతే, ప్రభుత్వం పంపిన డబ్బులు మొత్తం ఫార్ములా - ఈ కి చేరినప్పుడు అవినీతి అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని అధికారుల ఎదుట చెప్పినట్లు సమాచారం. మొదటి రేసు సందర్భంగా అర్బన్ ఏస్ సంస్థ పూర్తిగా ఫార్ములా-ఈతోనే కార్యకలాపాలు నిర్వహించిందని, కేవలం మౌలిక వసతులను మాత్రమే ప్రభుత్వం కల్పించిందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయానికి సంబంధించి అప్పటి ప్రభుత్వం ఏమైనా జీఓ ఇచ్చిందా అని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అయితే మరిన్ని విషయాలు తెలుసుకుంనేందుకు మరోసారి కేటీర్​కు నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తున్నారు.

ఏసీబీ ముందుకు బీఎల్​ఎన్​ రెడ్డి : మరోవైపు కేసులో అప్పటి హెచ్​ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్​ఎన్​ రెడ్డి ఇవాళ ఏసీబీ ముందు హాజరు కానున్నారు. అరవింద్‌ కుమార్‌ స్టేట్‌మెంట్‌ ఆధారంగానే బీఎల్​ఎన్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది.

4 ప్రశ్నలను 40 రకాలుగా అడిగారు - ఏసీబీ విచారణపై కేటీఆర్​

సుప్రీంకోర్టులో కేటీఆర్​కు చుక్కెదురు - క్వాష్ పిటిషన్‌ తక్షణ విచారణకు నిరాకరణ

Last Updated : Jan 10, 2025, 8:46 AM IST

ABOUT THE AUTHOR

...view details