ACB Officials Arrest Jammikunta Tehsildar Rajini : అవినీతి నిరోధక శాఖ అధికారులు దూకుడు పెంచారు. లంచాలు తీసుకుంటూ, అక్రమార్జనకు పాల్పడుతున్న అధికారులకు నిద్రలేకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహశీల్దార్గా పని చేస్తున్న రజిని నివాసంలో ఏసీబీ(ACB) అధికారులు సోదాలు నిర్వహించారు. కరీంనగర్ నుంచి వచ్చిన ఏసీబీ ప్రత్యేక విభాగం అధికారులు, స్థానిక అధికారులు హనుమకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీలోని ఆమె నివాసంతో పాటు బంధువుల ఇళ్లల్లోనూ ఏకకాలంలో దాడులు చేశారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 12 గంటల సేపు ఈ తనిఖీలు జరిగాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారం మేరకు అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. మొత్తం ఆరు బృందాలుగా విడిపోయి ఏసీబీ అధికారులు విస్తృత సోదాలు చేయగా విలువైన పత్రాలను గుర్తించారు. మొత్తం రూ.3 కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.12 కోట్లు ఉంటుందని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.
ACB Rides Jammikunta Tehsildar Rajini House :రెండు అంతస్తుల భవనం, 21 ఇంటి స్థలాలు, ఏడెకరాల వ్యవసాయ భూమి అక్రమాస్తులుగా గుర్తించామని పేర్కొన్నారు. అలాగే కిలోన్నర బంగారు ఆభరణాలు, రూ.25 లక్షల నగదు ఉన్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. తహశీల్దార్ రజిని(Jammikunta Tehsildar Rajini)ని అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ కోర్టుకు రిమాండ్ నిమిత్తం తరలిస్తున్నట్లు చెప్పారు.