తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫ్రెండ్ లాకర్​లో కిలోన్నర బంగారం, వజ్రాభరణాలు, ప్లాటినం నగలు - ఇదీ నిఖేశ్ అక్రమాస్తుల చిట్టా - AEE NIKESH KUMAR CASE LATEST UPDATE

ఏఈఈ నిఖేశ్​ కుమార్ ఆస్తుల దర్యాప్తులో కీలక విషయాలు - స్నేహితుడి లాకర్​లో కిలోన్నర బంగారం, ప్లాటినం నగలు, వజ్రాభరణాలు - ఏఈఈ నిఖేశ్​ కుమార్​పైన కస్టడీ పిటిషన్​ దాఖలు

AEE Nikesh Kumar
AEE Nikesh Kumar Case Update (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 6, 2024, 6:57 AM IST

Updated : Dec 6, 2024, 3:04 PM IST

AEE Nikesh Kumar Case Update : సంచలనం సృష్టించిన నీటి పారుదల శాఖ సస్పెండ్ ఏఈఈ నిఖేశ్​కుమార్ ఆస్తుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్నేహితుడి లాకర్​లో కిలోన్నర బంగారంతో పాటు ప్లాటినం నగలు, వజ్రాభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్‌కు 20 రోజుల ముందు భారీగా అస్తులను దాచిపెట్టినట్లు గుర్తించారు. నిఖేశ్​కుమార్ పలు బ్యాంకు ఖాతాల్లో లావాదేవీలను స్తంభింపజేయాలని బ్యాంక్ అధికారులకు ఏసీబీ లేఖలు రాసినట్లు సమాచారం.

అవినీతి నిరోధక శాఖ కేసుల్లో ఖరీదైన నిందితుల్లో ఒకడిగా నమోదైన ఇరిగేషన్ ఏఈఈ నిఖేశ్​కుమార్ అక్రమాస్తుల జాబితా పెరుగుతూ వస్తోంది. ఇటీవల అరెస్టైన సమయంలోనే అతడికి సంబంధించిన రూ.17.73 కోట్ల అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. తాజాగా మరిన్ని చరాస్తుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిఖేశ్ కుమార్ స్నేహితుడి బ్యాంకు లాకర్​లో దాదాపు కిలోన్నర బంగారు ఆభరణాలతో పాటు ప్లాటినం నగలు, వజ్రాభరణాలు, స్థిరాస్తులకు సంబంధించి కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడజాగీర్​లోని ఓ ప్రముఖ బ్యాంకులోని లాకర్‌లో ఉన్న వాటిని జప్తు చేశారు.

నిఖేశ్​ కుమార్​పైన కస్టడీ పిటిషన్​ : నీటి పారుదల శాఖ ఏఈఈ నిఖేశ్​ కుమార్​పైన ఏసీబీ అధికారులు కస్టడీ పిటిషన్​ను దాఖలు చేశారు. అతడిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఏసీబీ అధికారులు కోరారు. ఇప్పటికే అతను భారీగా అక్రమ ఆస్తులను కూడబెట్టారని గుర్తించారు.

20 రోజుల ముందే ఫ్రెండ్ లాకర్​లో : నిఖేశ్​ కుమార్ అరెస్ట్ కావడానికి దాదాపు 20 రోజుల ముందు వీటిని తన స్నేహితుడి బ్యాంకు లాకర్​లో దాచినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. తాను ఊరికి వెళ్తున్నానని స్నేహితుడిని నమ్మించి, అతడి బ్యాంకు లాకర్​లో వీటిని దాచినట్లు అధికారులు సమాచారం సేకరించారు. ఈ ఏడాది మే 30న లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కి అరెస్టయిన నిఖేశ్, మరోసారి ఏసీబీ అధికారులు తనపై దృష్టి సారించారనే అనుమానంతోనే చరాస్తుల్ని స్నేహితుడి బ్యాంక్ లాకర్​లో దాచి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మే 30న నిఖేశ్​ను అరెస్ట్ చేసిన రోజే ఏసీబీ అధికారులు అతడి ఇంట్లో 8 బ్యాంకు లాకర్​ తాళాలను గుర్తించారు.

వాటిల్లో రెండు నిఖేశ్ స్నేహితుల పేర్లపై ఉన్నట్లు దర్యాప్తు క్రమంలో అధికారులు గుర్తించారు. దీంతో నిఖేశ్ స్నేహితుడి సమక్షంలోనే ఒక లాకర్‌ను తెరిచారు. మరో స్నేహితుడి పేరిట ఉన్న లాకర్​ను ఒకట్రెండు రోజుల్లో తెరిచే అవకాశం ఉంది. నిఖేశ్​ను అరెస్ట్ చేసిన సమయంలో అతడి ఇంట్లో స్థిరాస్తి పత్రాలు తప్ప నగదు, నగలేమీ లభ్యం కాకపోడంతో లాకర్లలో దాచి ఉంటాడని అనుమానించారు. ఏసీబీ అధికారుల అనుమానం నిజం చేస్తూ ఒక లాకర్ తెరిస్తేనే రూ.కోట్లలో ఆభరణాలతో పాటు మరిన్ని కీలక పత్రాలు లభ్యం కావడం అధికారులను షాక్‌కు గురి చేసింది. నిఖేశ్ కుమార్‌ను కస్టడీకి తీసుకున్న అనంతరం అతడితో పాటు కుటుంబసభ్యుల సమక్షంలో మిగిలిన లాకర్లను తెరవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది.

కస్టడీ పిటిషన్​పై నేడు విచారణ : మరోవైపు నిఖేశ్​కుమార్​తో పాటు కుటుంబసభ్యులు, బినామీలుగా అనుమానిస్తున్న వ్యక్తుల బ్యాంకు ఖాతాల లావాదేవీలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటి వరకు తాము గుర్తించిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని ఆయా బ్యాంకులకు లేఖలు రాశారు. అలాగే నిఖేశ్​కు చెందిన ఐదు ఐఫోన్లను విశ్లేషించేందుకు ఎఫ్​ఎస్​ఎల్​కు పంపించారు. మరోవైపు తాను అరెస్టయిన వెంటనే నిఖేశ్​కుమార్ తన న్యాయవాది ద్వారా నాంపల్లి ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ అధికారులు సైతం అతడిని వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానానికి విన్నవించారు. కస్టడీ పిటిషన్‌పై న్యాయస్థానంలో ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది.

ఆస్తుల పత్రాలన్నీ మూటగట్టి - బాల్కనీ నుంచి బయట పడేసి

అదంతా అవి'నీటి' సొమ్మేనా? - లేక ఎవరికైనా బినామీగా ఉన్నాడా?

Last Updated : Dec 6, 2024, 3:04 PM IST

ABOUT THE AUTHOR

...view details