ABVP Leaders Protest at Education Commissioner Office :రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాంటూ ఏబీవీపీ నాయకులు విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో కార్యాలయం చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. లోనికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి విషమించడంతో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీతో పాటు పలువురు నాయకులను అరెస్టు చేశారు.
ఈ క్రమంలో పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సంవత్సరాల తరబడి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలు లేక విద్యార్థులు సరిగ్గా చదవలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు, సరిపడా అధ్యాపకులు లేక నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు.
ఏబీవీపీ నిరసనలో పోలీసుల ఓవరాక్షన్ - మహిళ కార్యకర్త జుట్టుపట్టుకొని
"తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతుంది. అయినా ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవు. ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టడం లేదు. కనీస సౌకర్యాలు కూడా లేనిచోట విద్యార్థులు ఎలా చదువుకుంటారు." - విద్యార్థి నాయకులు