Abhinaya Sri Special Talent in Rugby :ఖమ్మం పట్టణంలోని రోటరీనగర్‌కు చెందిన చెల్లగొండ అభినయశ్రీకి చిన్నప్పటి నుంచి క్రీడలంటే చాలా ఇష్టం. 10 వ తరగతి వరకు రోటరీనగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది.పాఠశాల స్థాయిలో క్రీడల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. ఇంటర్ ముదిగొండ మండలం కొత్త లక్ష్మీపురంలోని కస్తూర్బా విద్యాలయంలో చేరింది. ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
రగ్బీపై మక్కువ :చిన్నప్పటి నుంచే అభినయశ్రీ రగ్బీ ఆటపై ప్రత్యేక దృష్టి సారించింది. రగ్బీ పోటీలను చూస్తూ ఆ ఆటపై ప్రత్యేక దృష్టి పెట్టి సాధన చేసింది. ఆట విశిష్టత, ఆటలో మెలకువలపై ప్రత్యేకంగా శోధన చేసి మరీ ప్రాక్జీసు చేస్తుండేది. రగ్బీ ఆటపై అభినయశ్రీకి ఉన్న ఇష్టాన్ని గుర్తించిన ప్రత్యేక అధికారిణి ఇందిర, పీఈటీ నిర్మల ప్రోత్సాహంతో ఆటలో రాటుదేలుతూ వచ్చింది. జిల్లాస్థాయిలో ఎంపికల్లో మైదానంలో చిచ్చరపిడుగులా రగ్బీలో సత్తా చాటింది. తర్వాత రాష్ట్రస్థాయిలో పలు పోటీల్లో పాల్గొని ఔరా అనిపిందింది.
రాష్ట్రస్థాయిలో సత్తా : ఇటీవల హైదరాబాద్‌లోని జింఖానా ఫుట్‌బాల్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఏటికేడు రగ్బీ ఆటలో ప్రావీణ్యం సాధించడమే కాకుండా అద్భుతమైన ఆటతీరుతో జాతీయ స్థాయి టోర్నీల్లోనూ తనదైన ముద్రవేసింది. పలు రాష్ట్రాల్లో నిర్వహించిన పోటీలకు రాష్ట్రం తరపున ఆడి సత్తా చాటింది. ఇటీవల పూణేలోని బల్లెవాడిలో జూలై నెలలో జరిగిన జాతీయ స్థాయి రగ్బీ పోటీల్లో ఉత్తమ ప్రదర్శనతో నిర్వాహకుల మనసు గెలిచింది.
దేశం తరఫున ఆడటమే లక్ష్యంగా : జాతీయ స్థాయిలో భారత జట్టు తరపున ఆడి అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే తన లక్ష్యమంటోందీ అభినయశ్రీ. ఇక రగ్భీ ఆట ఒక్కటే కాకుండా ఆరో తరగతి నుంచి కరాటే నేర్చుకుని జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని తన పంచ్‌ల రుచి చూపిస్తోందీ అభినయశ్రీ. గోవాలో జరిగిన నేషనల్ యూత్ స్పోర్ట్స్ ఎడ్యూకేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొని బంగారు పతకం, బ్లాక్‌బెల్ట్ సాధించింది.