Hydra Demolishes in Film Nagar Today : రాష్ట్ర రాజధానిలో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణల కూల్చివేతలపై కొద్ది రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న హైడ్రా తాజాగా ఫిల్మ్ నగర్ రోడ్డు నెం.12లో బుల్డోజర్లతో విరుచుకుపడింది. అక్కడి ప్రముఖ విగ్రహాల సమీపంలోని నిర్మాణాన్ని నేలమట్టం చేసింది. రెండు జేసీబీల సహాయంతో హైడ్రా సిబ్బంది షెడ్డును కూల్చివేశారు. ఫిల్మ్ నగర్ హౌజింగ్ సొసైటీ రోడ్డును ఆక్రమించి ఫిల్మ్ నగర్ మహిళా మండలి పేరుతో నిర్మాణం చేపట్టి కార్యకలాపాలు నిర్వహిస్తోందని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పరిశీలించిన హైడ్రా డిప్యూటీ సిటీ ప్లానర్ మూడు రోజుల కిందట ఫిల్మ్ నగర్ హౌజింగ్ సొసైటీకి నోటీసులు జారీ చేశారు.
అనధికారికంగా నిర్మించిన ఫిల్మ్ నగర్ మహిళా మండలి భవనాన్ని 24 గంటల్లో తొలగించాలని ఆదేశించారు. ఫిల్మ్ నగర్ హౌజింగ్ సొసైటీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అనధికారిక నిర్మాణాన్ని కూల్చివేశామని హైడ్రా అధికారులు తెలిపారు. ఆ ప్రదేశంలో ఉన్న విగ్రహాల జోలికి వెళ్లలేదని స్పష్టం చేశారు. అయితే హైడ్రా కూల్చివేతపై ఫిల్మ్ నగర్ హౌజింగ్ సొసైటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ సొసైటీకి చెందిన 290 గజాల్లో మహిళా మండలి భవనంతో పాటు విగ్రహాలు పెట్టడానికి కేటాయించామని, తాము ఎలాంటి రోడ్డును ఆక్రమించలేదని సొసైటీ కార్యదర్శి ఖాజా సూర్యనారాయణ తెలిపారు. తమ స్థలంలోని నిర్మాణాన్ని హైడ్రా అన్యాయంగా కూల్చివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అంగుళం ఆక్రమించినా ప్రభుత్వానికి తెలుస్తోంది : మరోవైపు నగరంలోని చెరువులు, కుంటలను ఎవరూ ఆక్రమించకుండా ఇప్పటికే రంగారెడ్డి జిల్లా రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు పకడ్బందీగా లెక్కలు సిద్ధం చేస్తున్నారు. డిజిటల్ సర్వేల సహాయంతో చెరువుల విస్తీర్ణాన్ని, బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ను నిర్ణయిస్తున్నారు. ప్రతి చెరువుకు సంబంధించిన అంశాలను జియో ట్యాగ్ చేసి హెచ్‌ఏండీఏ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. దాదాపు జిల్లాలోని 1075 చెరువులుండగా 107వి పూర్తి చేసి హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో ఉంచారు. ఈ నేపథ్యంలో మిగిలిన వాటి తుది సర్వే కూడా పూర్తిచేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.
వాటిపై ఫోకస్ పెట్టిన హైడ్రా - ప్రత్యేక టీమ్‌తో బెంగళూరుకు కమిషనర్ రంగనాథ్