తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రియుడితో కలిసి మూడో భర్తను కొట్టిచంపిన భార్య - ఆపై స్పాట్​లో నుంచి మరో ప్రియుడికి ఫోన్​ చేసి?

హైదరాబాద్​లోని మేడిపల్లిలో దారుణ ఘటన - ప్రియుడితో కలిసి మూడో భర్తను చంపిన భార్య - రెండో భర్తను మోసం చేసిన కేసులో గతంలో జైలుకెళ్లిన నిందితురాలు

HYDERABAD CRIME
WOMAN KILLED HER HUSBAND (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Woman Killed Her Husband in Hyderabad : ఆమెకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. డబ్బు మీద అత్యాశతో ఆస్తి కోసం ప్రియుడితో కలిసి మూడో భర్తను హత్య చేసింది. హైదరాబాద్‌లో చంపేసి మృతదేహాన్ని కారులో కర్ణాటకకు తరలించి అక్కడ దహనం చేసింది. కర్ణాటక పోలీసుల దర్యాప్తులో విషయం బయటపడటంతో ఆమెతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన నిహారిక (29) వరుసగా పెళ్లిళ్లు చేసుకుని వారికి విడాకులిచ్చింది. మొదటి పెళ్లి బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌తో జరగగా, రెండో పెళ్లి హరియాణాకు చెందిన వ్యక్తితో అయ్యింది.

హరియాణాకు చెందిన రెండో భర్త పెట్టిన కేసులో జైలుకు వెళ్లగా, ఆమెకు అక్కడ మరో మహిళా ఖైదీతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమె కుమారుడు రాణాతో ప్రేమలో పడింది. అనంతరం కర్ణాటకలోని బెంగళూరుకు మకాం మార్చింది. అనంతరం మాట్రిమోనీ వేదిక ద్వారా హైదరాబాద్‌ తుకారాంగేట్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి రమేశ్‌ కుమార్‌తో పరిచయం ఏర్పర్చుకుంది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నానని చెప్పి ముగ్గులోకి దింపింది.

అనుమానంతోనే? : రమేశ్‌కు అప్పటికే భార్య, కుమార్తె ఉన్నారు. అయినా ఇద్దరూ 2018లో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఘట్‌కేసర్‌ సమీపంలోని పోచారం సంస్కృతి టౌన్‌షిప్‌లో కాపురం పెట్టారు. ఉద్యోగం పేరిట నిహారిక బెంగళూరుకు వెళ్లి వచ్చేది. ఈ క్రమంలో నిహారిక ఈ నెల (అక్టోబర్)4న పోచారానికి రాగా, అప్పటికే ఆమె తీరుపై అనుమానం వచ్చిన రమేశ్‌ కుమార్‌ నిలదీయడంతో వివాదం మొదలైంది. ఇంటి నుంచి బయటికి వెళ్లిన నిహారిక ప్రియుడు రాణాను వెంటబెట్టుకొని తిరిగొచ్చింది.

ముగ్గురూ కలిసి మద్యం తాగారు. రాత్రి 11 గంటల సమయంలో కారులో బయటికి వెళ్లారు. హత్య చేయాలని ముందే నిహారిక, రాణాలు పథకం సిద్ధం చేసుకున్నారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పీర్జాదిగూడ కమాన్‌ వద్ద రమేశ్‌ను నిందితులు కారులోనే కొట్టి చంపారు. ఈ విషయాన్ని నిహారిక బెంగళూరులోని మరో ప్రియుడు నిఖిల్‌ రెడ్డికి చెప్పింది. అతడి సలహాలు, సూచనలతో మృతదేహాన్ని కారులోనే కర్ణాటకలోని కొడుగు జిల్లా సుంటికుప్ప ప్రాంతానికి తరలించారు.

అక్కడ ఓ కాఫీ తోటలో మృతదేహాన్ని ముక్కలు చేసి దహనం చేసి పారిపోయారు. అక్టోబరు 8న మృతదేహాన్ని గుర్తించి స్థానికులు అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. కాఫీ తోట, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న 500 సీసీ కెమెరాలను వారు పరిశీలించారు. వాటిలో నమోదైన కారు నంబరు ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. రమేశ్‌కుమార్‌ పేరిట ఉన్న రూ.కోట్ల ఆస్తిని కాజేసేందుకే హత్య చేసినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. హత్య హైదరాబాద్​లో జరగడంతో కేసును మేడిపల్లి ఠాణాకు బదిలీ చేయనున్నారు.

ఇంట్లో ఇల్లాలు - లాడ్జిలో ప్రియురాలు - రెడ్​హ్యాండెడ్​గా దొరికిపోయిన ఎంపీడీవో

తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన ఐఏఎస్‌లకు పోస్టింగులు - ఆమ్రపాలికి ఏ శాఖ ఇచ్చారంటే?

ABOUT THE AUTHOR

...view details