How To Clean Clay Lamps : వెలుగుల పండగ దీపావళి రోజున ఇంటిని దీపాలతో శోభాయమానంగా అలంకరిస్తుంటాం. పూజ కోసం దీపాలు వెలిగించడానికి ఇత్తడి, వెండి దీపపు కుందుల్ని ఎంచుకుంటే.. ఆరుబయట వెలిగించడానికి మట్టి, టెర్రకోటాతో తయారుచేసిన ప్రమిదలు ఉపయోగిస్తుంటాం. అయితే ఏడాదికోసారి వాడే మట్టి/టెర్రకోటా దీపాలపై నూనె జిడ్డు మరకలతో పాటు, నల్లటి పొగ కూడా పేరుకుపోతుంది. ఈ క్రమంలో వాటిని పండగ రోజున కొత్తవాటిలా మెరిపించడానికి కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో చూద్దాం..
డిష్‌వాషింగ్ లిక్విడ్‌తో : మట్టి/టెర్రకోటా దీపపు కుందులపై పేరుకున్న దుమ్ము, జిడ్డు ఈజీగా తొలగిపోవు. వీటిని కొత్త వాటిలా మెరిపించడం కోసం.. అరకప్పు నీటిలో టీస్పూన్ డిష్‌వాషింగ్ లిక్విడ్, కొన్ని చుక్కల వెనిగర్ వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని కుందులపై పోసి టూత్‌బ్రష్ సహాయంతో నెమ్మదిగా రుద్దండి. ఇలా చేస్తే జిడ్డు తొలగిపోతుంది.
ప్రత్యేకమైన కుందులను ఇలా శుభ్రం చేద్దాం : పెయింట్, రాళ్లు, బీడ్స్‌తో డిజైన్ చేసిన మట్టి/టెర్రకోటా కుందులు కూడా కొంతమంది క్లీన్ చేయాలనుకుంటారు. కానీ వీటిని నీళ్లు, ఇతర లిక్విడ్లతో శుభ్రం చేస్తే అవి డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి, మినీ వ్యాక్యూమ్ క్లీనర్‌కు చిన్న బ్రష్‌ని అటాచ్ చేసి.. దాంతో శుభ్రం చేస్తే సందుల్లో ఇరుక్కున్న దుమ్ము వదిలిపోతుంది. అలాగే జిడ్డు పోవాలంటే గోరువెచ్చటి డిటర్జెంట్ వాటర్‌లో ముంచిన క్లాత్‌తో నెమ్మదిగా తుడిచేస్తే సరిపోతుంది. కావాలంటే వీటిపై నుంచి మరో కోట్ పెయింట్ వేస్తే అవి కొత్తవాటిలా మెరుస్తాయి.
వెనిగర్‌తో : ముందుగా గిన్నెలో టీస్పూన్ రాళ్ల ఉప్పు, మూడు టీస్పూన్ల వెనిగర్ వేసి.. ఈ రెండింటినీ పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ లిక్విడ్‌ని కుందులకు పూసి కాసేపు అలా వదిలేయాలి. తర్వాత మెత్తటి క్లాత్‌తో రుద్దుతూ చల్లటి నీటితో కడిగేస్తే మట్టి/టెర్రకోటా దీపపు కుందులూ కొత్త వాటిలా మారతాయి.
నిమ్మరసం : ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకొని అందులో రెండుమూడు టీస్పూన్ల నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో దీపపు కుందుల్ని వేసి 10 నిమిషాలు నానబెట్టాలి. కావాలంటే ఈ లిక్విడ్‌లో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ కుందుల్ని మృదువైన బ్రష్‌తో రుద్దుతూ క్లీన్ చేస్తే వాటిపై ఉన్న మురికి, జిడ్డు తొలగిపోతాయి.
ఈ విధంగా మట్టి/టెర్రకోటా దీపాల్ని/కుందుల్ని క్లీన్ చేశాక ఎండలో కాసేపు ఆరబెట్టి వాడుకోవాలి. అలాగే తిరిగి భద్రపరచుకునే ముందు మరోసారి క్లీన్ చేసి.. బబుల్ ర్యాప్ కవర్‌లో చుట్టి కాటన్ బాక్స్‌లో పెట్టి స్టోర్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇత్తడి కుందులు నల్లగా మారాయా? - ఈ టిప్స్ పాటిస్తే దీపావళి వేళ బంగారంలా మెరుస్తాయి!
గోడలు మురికిగా మారాయా ? - ఈ టిప్స్ పాటిస్తూ క్లీన్ చేసి - దీపావళికి అందంగా మార్చండి!