Coming Two Months Wedding Season in Telangana : దీపావళి పండుగ ముగియగానే పెళ్లిళ్ల సీజన్ ప్రారంభంకానుంది. ఇందుకు వివాహా వేదికలు సిద్ధమవుతున్నాయి. మూడు నెలలుగా మూడాల కారణంగా శుభాకార్యాలు జరగలేదు. ఇక ఇప్పటి నుంచి పెళ్లి బ్యాండ్ బాజాలు మొదలవుతాయి. రెండు నెలల పాటు మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. దీంతో నిర్వాహకులు ఇప్పటి నుంచే పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు. మంచి ముహూర్తం నిర్ణయించుకునేందుకు పురోహితులను ఆశ్రయిస్తున్నారు. రెండు నెలల పాటు వాయిద్యాలు, మండపాలు, క్యాటరింగ్ నిర్వాహకులకు చేతి నిండా పనులు ఉండనున్నాయి. మరోవైపు అడ్వాన్సులు చెల్లించి ఫంక్షన్ హాళ్లను బుక్ చేసుకుంటున్నారు.
నవంబర్ నెల నుంచి మోగనున్న పెళ్లి బాజాలు - పంచాంగకర్తలు చెప్పిన శుభముహూర్తాలు ఇవే!
ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో సుమారు వెయ్యికి పైగా ఫంక్షన్ హాళ్లు ఉండగా వసతులను బట్టి ఒక్క రోజు అద్దె రూ.70వేల నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేస్తారు. పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో వాటి ధరలు ఒక్కసారిగా పెంచేశారు. దీపావళి కావడంతో వస్త్ర, బంగారు దుకాణాలు కొనుగోళ్లతో సందడిగా మారింది. ఇదే ఒరవడి రెండు నెలల పాటు ఉండనుంది. నాలుగు జిల్లాల్లోని సిద్దిపేట, గజ్వేల్, మెదక్, సంగారెడ్డి, జహీరాబాద్, వికారాబాద్, తాండూరుల్లోని దుకాణాల్లో రద్దీ పెరగనుంది. దీనికి తోడు ఇక్కడి నుంచి మరికొందరు హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేయనున్నారు.
నవంబర్, డిసెంబర్ నెలల్లో 21రోజుల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఆయా రోజుల్లో నాలుగు జిల్లాల్లో 20 వేలకు పైగా వేలల్లో పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా.
నవంబరులో - 3, 7, 8, 9, 10, 13, 14, 15, 16, 17
డిసెంబర్‌లో - 5, 6, 7, 8, 9, 10, 13, 14, 15, 18, 26
"డిసెంబరు వరకు అన్ని రకాల వేడుకలకు మంచి ముహూర్తాలున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్లకు ఎక్కువ సంఖ్యలో ముహూర్తాలు ఉన్నాయి. ఇప్పటికే ఎంతోమంది మమ్మల్ని సంప్రదించారు. రెండు నెలల్లో 21 రోజులు బాగున్నాయి." - విశ్వం, పురోహితుడు