Woman Died After Eating Momos : మోమోస్ తిని ఓ మహిళ మృతిచెందగా మరో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల కథనం ప్రకారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నందినగర్, సింగాడకుంట బస్తీ, గౌరీ శంకర్ కాలనీలో శుక్రవారం జరిగిన సంతలో మోమోస్ విక్రయించారు.
సింగాడకుంట బస్తీకి చెందిన రేష్మ బేగం (31)తో పాటు ఆమె పిల్లలు, ఆయా బస్తీల్లోని సుమారు 50 మంది వీటిని తిన్నారు. వీరందరికీ శనివారం నుంచి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో బంజారాహిల్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పలు ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో కొందరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మోమోస్ తిన్నవారిలో దాదాపు 10 మంది పిల్లలు ఉన్నారు. రేష్మ బేగం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో ఆమె దురదృష్టవశాత్తు మృతి చెందారు.
GHMC Officials Seized Momos Manufactures : ఈ ఘటనలో మోమోస్ తయారు చేసిన సంస్థను జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్ చేశారు. ఒకరి మృతికి కారణమైన మోమోస్ శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. వీటిని చింతలబస్తీలో మోమోస్ తయారు చేసినట్లు గుర్తించి శాంపిల్స్ సేకరణ చేశారు. వీటి తయారీకి ఎలాంటి అనుమతులు లేనట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తేల్చారు.
మయోనైజ్ పైనే అనుమానం?: ఈ సంఘటనపై ఇప్పటికే బాధితులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మోమోస్ విక్రయించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయిస్తున్నారు. మోమోస్‌తో పాటు ఇచ్చే మయోనైజ్, మిర్చి చట్నీ కలుషితమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మోమోస్‌తో పెద్ద పెద్ద రెస్టారెంట్లు మంచి లాభదాయక వ్యాపారాలు చేస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో మల్టీప్లెక్స్‌లల్లో ఈ మోమోస్ కోసం చాలా మంది వెళుతున్నారు.
ఎక్కువగా ఈ మోమోస్‌ను నార్త్ ఇండియన్స్ ఇష్టపడి తింటుంటారు. ఒకప్పుడు కేవలం పెద్దపెద్ద రెస్టారెంట్లలో మాత్రమే లభించిన మోమోలు ప్రస్తుతం ఇతర ఫాస్ట్‌ఫుడ్స్ మాదిరి అన్నిచోట్లా దొరుకుతున్నాయి. ఇవి అందరికీ ఫేవరెట్ అయిపోయి ఎప్పుడైనా తినేందుకు చక్కని ఎంపికవుతున్నాయి. మరి ఈ మోమోల సంగతి ఏంటి? ఇవి ఎక్కడ పుట్టాయో కూడా చూద్దాం.
మోమోస్ లేదా డంప్లింగ్స్ ఇలా ఏ పేరుతో పిలిచినా వీటిని తొలిసారి టిబెట్‌వాసులు తయారుచేశారు. పద్నాలుగో శతాబ్దంలో ఈ మోమోలను టిబెటన్లు వండారు. కొన్నాళ్లకు నేపాల్‌కు వలస వెళ్లి స్థిరపడిన కొందరు టిబెట్ వాసులు అక్కడా వీటిని చేయడంతో నేపాలీలూ తమ వంటకాల జాబితాలో మోమోలను చేర్చుకుని పండుగలూ, ప్రత్యేక వేడుకల్లో వీటిని తయారుచేయడాన్ని ఓ సంప్రదాయంగా పెట్టుకున్నారు. భారత్‌కు టిబెటియన్లు ఎక్కువ సంఖ్యలో వచ్చి లద్దాక్, డార్జిలింగ్, ధర్మశాల, సిక్కిం తదితర ప్రాంతాల్లో స్థిరపడటంతో అవన్నీ మోమోల తయారీ కేంద్రాలుగా మారిపోయి నెమ్మదిగా ఇతర భారత దేశంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించాయి.
త్వరలో హైదరాబాద్‌లో మయోనైజ్ తినడం కుదరదు!
మయోనైజ్ తిని 17 మందికి అస్వస్థత - రక్తపరీక్షల్లో ఏం తేలిందంటే?