Each Single Room Have one House Number : ఆస్తి పన్ను రికార్డుల్లో నాలుగు అంతస్తులు కలిగిన భవనానికి బదులు ఇలా ఒకే షెడ్డును చూపి ఏకంగా దానికి ఇరవై నాలుగు ఇంటి నెంబర్లు జారీ చేశారు మన అధికారులు. ఆదిలాబాద్ పట్టణం నుంచి గ్రీన్ సిటీ మీదుగా బట్టిసావర్గాం వెళ్లేదారిలో విశాలమైన భవన సముదాయం ఉంది. నాలుగు అంతస్తులతో కొన్నేళ్ల కిందట నిర్మించారు. ఈ భవన నిర్మాణ దశ నుంచే బల్దియాకు పెద్ద మొత్తంలో ఫిర్యాదులు అందాయి.
స్థానికుల నుంచి అభ్యంతరాలు తీవ్రంగా వ్యక్తమయ్యాయి. అప్పటి రెవెన్యూ, బల్దియా అధికారులు మామూళ్లకు ఆశపడి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ భవనంలోని ప్రతి గదిని ఒక ఇల్లుగా పరిగణించి పురపాలక అధికారులు హుటాహుటిన 24 అసెస్‌మెంట్లు చేశారు. సాధారణ వ్యక్తులకు అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా, ఇంటి నెంబరు కేటాయించాలంటే వారిని ముప్పతిప్పలు పెట్టే అధికారులు ఆ యజమాని విషయంలో నిబంధనలను తుంగలో తొక్కారు. ఒకే భవనానికి ఒక్కరి పేరు మీదే 24 ఇంటి నెంబర్లతో బల్దియా పోర్టల్లో నమోదు చేశారు.
బల్దియా ఖజానాకు నష్టం :వాస్తవానికి ఆ బహుళ అంతస్తుల భవనానికి కమర్షియల్ (వ్యాపారం) కేటగిరీలో ఏడాదికి రూ.2 లక్షలకు పైగానే పన్ను వేయాలి. ఆ పన్నును ఎగ్గొట్టేందుకు ఒక్కో గదిని తక్కువ విస్తీర్ణంతో లెక్కంచారు. 6 నెలలకు సగటున కేవలం రూ.312 చొప్పున ఏడాదికి రూ.624 మాత్రమే ఆస్తి పన్నును కడుతున్నారు. ఈ లెక్కన 24 అసెస్‌మెంట్లకు కలిపి ఏడాదిలో దాదాపుగా రూ.15 వేల లోపు మాత్రమే పన్నుల రూపేనా ఆదాయం వస్తుంది.