CCTV Footage Case in Guntur : సీసీ కెమెరాలు ఫిట్టింగ్ చేసే సంస్థలో టెక్నీషియన్ ఉద్యోగం చేస్తూ అక్రమంగా సీసీ ఫుటేజీల యాక్సెస్ పొందుతున్నారు ముగ్గురు వ్యక్తులు. వారిపై బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో శేషు అనే వ్యక్తితో పాటు ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కెమెరామన్ వంశీ, ఓ న్యూస్ పేపర్ విలేకరి అరుణ్‌లపై ఏపీలోని గుంటూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా టీవీ ఛానెల్ కెమెరామెన్ వంశీని విచారణకు పిలిచిన పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చి పంపించేశారు.
గుంటూరుకు చెందిన శేషు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే ఓ సంస్థలో టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. కస్టమర్ల ఆర్డర్ల మేరకు ఇళ్లు, కార్యాలయాలు, వ్యవసాయ క్షేత్రాలు, బహిరంగ ప్రదేశాలు, ఫామ్‌హౌస్‌లలో సీసీ కెమెరాలు బిగిస్తుంటారు. ఈ ప్రక్రియ పూర్తయిపోయాక వాటి యూజర్ ఐడీ, పాస్వర్డ్లు వంటివి సంబంధిత యజమానులకే ఇచ్చి వారికే యాక్సెస్ ఇవ్వాలి. కానీ శేషు మాత్రం అందుకు విరుద్ధంగా పని చేస్తున్నాడు. ఆయా సీసీ ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యే దృశ్యాల యాక్సెస్‌ను తన దగ్గర కూడా పెట్టుకుని దుర్వినియోగానికి పాల్పడ్డాడు. తన ఫోన్‌లో ఆయా వీడియోలను చూస్తూ వారి వ్యక్తిగత విషయాలకు భంగం కలిగిస్తున్నారు. ఫుటేజీలను అడ్డం పెట్టుకుని, ఇతరులతో కలిసి బెదిరింపులకు పాల్పడినట్లు పలు సందర్భాలున్నాయి.
బోరుగడ్డ అనిల్ కేసుతో :ఇటీవల అరండల్‌పేట పోలీసు స్టేషన్ లోపల రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్‌కు దిండు, పడక ఏర్పాట్లు చేేశారు. ఆయన మేనల్లుడైన మైనర్ బాలుడిని స్టేషన్ లోపలికి అనుమతించిన దృశ్యాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పోలీస్ స్టేషన్ లోపల ఉన్న సీసీ ఫుటేజీ దృశ్యాలు బయటకు ఎలా వెళ్లాయనే దానిపై విచారణ చేయగా, శేషు పాత్ర బయటపడింది. అరండల్‌పేట పోలీసుస్టేషన్‌లో గతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన శేషు వాటి యాక్సెస్‌ను తనవద్ద పెట్టుకున్నట్లు తేలింది.