Fake Currency Case In Guntur District: నేటి సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆర్థిక సమస్యలు ఉన్నాయి. వాటి నుంచి బయటపడేందుకు కొద్దిమంది కష్టపడితే, మరికొద్దిమంది మాత్రం అడ్డదారులు తొక్కుతారు. అలాంటి ఘటనే మంగళగిరిలో జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున మంగళగిరి టోల్‌ప్లాజా దగ్గరకు ఓ భార్యాభర్తల జంట వచ్చింది. వాళ్లు తెచ్చిన డబ్బులు ఓ వ్యక్తికి ఇచ్చారు. అతను వాళ్లకు సూట్‌కేసు ఇచ్చాడు. అంతే వెంటనే అతను పోలీసులు వస్తున్నారు, పారిపోండి అని చెప్పాడు. కంగారుపడ్డ ఆ భార్యాభర్తలు అక్కడినుంచి పారిపోయారు. కొద్దిసేపు తర్వాత సూట్‌కేసు తెరిచిన దంపతులు అవాక్కయ్యారు. తాము మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.
అసలేమైందంటే:గుంటూరు జిల్లా పేరేచర్లలో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న వ్యక్తి తిరుచానూరులోని ఓ మహిళకు పరిచయమయ్యాడు. ఈ క్రమంలో నకిలీ నోట్ల గురించి చెప్పాడు. ఎవరైనా రూ. 15 లక్షలు ఇస్తే వారికి రూ. 30 లక్షల నకిలీ నోట్లు ఇస్తానని ఆశ చూపించారు. అందుకు తిరుచానూరులోని పగడాల జ్యోతి దంపతులు ఆశపడి మధ్యవర్తి ద్వారా అతన్ని సంప్రదించారు. జనవరి 31 తెల్లవారుజామున మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్దకు వస్తే నకిలీ డబ్బులు ఇస్తానని చెప్పడంతో తిరుచానూరు నుంచి వారు ఇక్కడికి చేరుకున్నారు.
తరువాత తిరుచానూరు నుంచి దంపతులు తెచ్చిన అసలు నోట్లు తీసుకొని బదులుగా నకిలీ నోట్లు ఇచ్చాడు. అంతలోనే పోలీసులు వస్తున్నారని హడావిడి చేసి వారిని అక్కడ నుంచి పంపించి వేశాడు. పక్కకు వచ్చి డబ్బులు చూసుకుని వారు షాక్‌కు గురయ్యారు. సూట్‌కేసులో ఉన్నవన్నీ తెల్లకాగితాలని అర్ధమైంది. దాంతో బాధితులు మంగళగిరి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించారు.