Telangana HC Acquitted A Man After 11 Years Of Imprisonment : తల్లిని హత్య చేశాడన్న నేరంపై 2013లో ఆరెస్టయి జైలులో మగ్గుతున్న వ్యక్తి 11 ఏళ్ల తరువాత హైకోర్టు తీర్పుతో నిర్దోషిగా విడుదలయ్యాడు. మెదక్ జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవల్లికి చెందిన పెద్దగుండెల్లీ అలియాస్ పెద్దగుండేల పోచయ్యకి తల్లి హత్య కేసులో కింది కోర్టు యావజ్జీవ శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది.
ఈ కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టపరమైన, ఆమోదయోగ్యమైన సాక్ష్యాలు లేనప్పుడు కేవలం ఊహలు, అంచనాల ఆధారంగా కోర్టులు సొంత అభిప్రాయాలను ఏర్పరచుకోజాలవని స్పష్టం చేసింది. హత్య కేసులో దోషి అని తేలితే జీవితాంతం జైలుకు పంపాల్సి ఉంటుందని, నేరానికి పాల్పడినట్లు ఎలాంటి అనుమానం లేకుండా ప్రాసిక్యూషన్ ఆధారాలు సమర్పించాలంది. ఇక్కడ కేసులో సాక్షులు, మాట మార్చి నిందితుడికి వ్యతిరేకంగా ఏమీ చెప్పలేదని, వృద్ధురాలిది హత్య, ఆత్మహత్య అనేది కూడా చెప్పని డాక్టరు, దర్యాప్తు అధికారి సాక్ష్యాల ఆధారంగా మాత్రమే శిక్ష విధించడం సరికాదంటూ కింది కోర్టు తీర్పును రద్దు చేసింది.
'ఇంకా నయం, వర్షపు నీటికి చలాన్ వేయలేదు'- CBIకి దిల్లీ IAS స్టడీ సెంటర్ కేసును అప్పగించిన హైకోర్టు
2013 ఫిబ్రవరి 1న అందిన ఫిర్యాదు మేరకు 80 ఏళ్ల తల్లిని టవల్‌తో గొంతు నులిమి చంపి, తరువాత సీతాపల్ చెట్టుకు ఊరేసి చంపాడన్న ఆరోపణపై పోచయ్యను పోలీసులు ఆరెస్ట్ చేశారు. తల్లి అనారోగ్యంతో విసిగిపోయి, తనను చూసుకోలేక చంపేశానని నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు దర్యాప్తును ముగించి అభియోగ పత్రం దాఖలు చేశారు. దీనిపై సిద్ధిపేట కోర్టు విచారణ చేపట్టి హత్య, సాక్ష్యాలను మాయం చేశారన్న నేరాలపై యావజ్జీవ శిక్ష విధిస్తూ 2015లో యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
పోచయ్య ఈ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీలు చేశారు. విచారణ సందర్భంగా బెయిలు మంజూరు చేయాలన్న పోచయ్య మధ్యంతర పిటిషను 2015 డిసెంబరులో హైకోర్టు కొట్టివేసింది. పోచయ్య అప్పీలుపై జస్టిస్ కె.సురేందర్, జస్టిస్ జె. శ్రీనివాసరావులతో కూడిన ధర్మాను ఇటీవల విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. హత్య కారణంగానే వృద్ధురాలు మృతి చెందారని ప్రాసిక్యూషన్ స్పష్టంగా చెప్పాలని, డాక్టరు కచ్చితంగా చెప్పనపుడు ప్రత్యక్ష సాక్షులపై ఆధారపడవచ్చని తెలిపింది. అయితే, ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా లేరంది. పరిస్థితుల ఆధారంగా నమోదైన ఈ కేసులో నేరాన్ని రుజువు చేయాలంటే గతంలో సుప్రీం కోర్టు చెప్పిన పంచసూత్రాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. పోచయ్యపై ఎలాంటి కేసులు లేని పక్షంలో తక్షణం విడుదల చేయాలని ఆదేశించింది.
చాక్లెట్ ఆశచూపి ఐదేళ్ల బాలికపై అత్యాచారం ఆపై హత్య - దోషికి ఉరిశిక్ష - TG HC DEATH SENTENCE IN RAPE CASE