Cast Cense Survey in Nirmsl Distric : తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ, కుల సర్వేను నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్, గుండంపెల్లి గ్రామాల్లోని ప్రజలు బహిష్కరించారు. తమ గ్రామాలైన దిలావర్పూర్-గుండంపెల్లి మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా వారు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేపడుతున్నారు. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కుల గణన సర్వే ప్రారంభమవడంతో దానిని నిర్వహించేందుకు గ్రామాల్లోని ప్రజల వద్దకు ఎన్యుమరేటర్లు వెళ్లగా, ప్రజలు తిరస్కరించడం తీవ్రమైన అంశంగా మారింది.
ప్రభుత్వం తమ గ్రామాలకు హాని కలిగించే ఇథనాల్ ఫ్యాక్టరీని ఎత్తి వేసేందుకు సహకరించడం లేదని గ్రామస్థులు వాపోయారు. అధికారులకు తాము వివరాలు చెప్పమని, తమ ఊరి నుంచి వెళ్లిపోవాలని పేర్కొంటున్నారు. ఫ్యాక్టరీని తరలించే వరకు సమగ్ర కుల సర్వేకు సహకరించేది లేదని గ్రామస్థులు తీర్మానం చేసి అక్కడి అధికారులకు అందజేశారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక వెనుదిరిగి వెళ్లిపోయారు.
ఎన్యుమరేటర్లకు చేదు అనుభవాలు : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కులగణనను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. ఈ నెల (నవంబరు) 06 నుంచి స్టిక్కరింగ్ను అధికారులు పూర్తి చేశారు. నవంబర్ 09వ తేదీ నుంచి ఎన్యుమరేటర్లు ఇంటింటికి తిరిగి సమాచారాన్ని సేకరించి నమోదు చేస్తున్నారు. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో సర్వేకు వెళుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు మాత్రం చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. సెక్యురిటీ సిబ్బంది ఇంటి లోపలికి అనుమతించడం లేదు. మరికొన్ని ప్రాంతాల్లో కుక్కలను వదులుతున్నారని సర్వే అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.