Traffic Police Who Saved A Family : రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించింది. పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి పనామా వద్ద కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ట్రాఫిక్ పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి చిన్నారులతో సహా ఓ కుటుంబాన్ని కాపాడారు.
ఇదీ జరిగింది :వనస్థలిపురం ట్రాఫిక్ సీ.ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం హయత్‌నగర్‌కు చెందిన జిల్లా వినోద్ తన భార్య, పిల్లలతో కలిసి హయత్ నగర్ నుంచి ఎల్బీనగర్ వైపునకు వర్షం పడుతోన్న సమయంలో కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో పనామా చౌరస్తా దగ్గరకు రాగానే వరద ఉద్ధృతికి కారు అదుపు తప్పి పక్కనే ఉన్న వర్షపు నీటితో నిండి ఉన్న నాలాలోకి దూసుకువెళ్లింది.
ఓ కుటుంబాన్ని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు :ఆ ప్రాంతంలోనే విధుల్లో ఉన్న వనస్థలిపురం ట్రాఫిక్ కానిస్టేబుళ్లు సైదులు, శ్రీనివాసరావు, సీ.ఐ వెంకటేశ్వర్లు కారు నాలాలో చిక్కుకున్న విషయం గమనించారు. వెంటనే స్పందించి సమయస్ఫూర్తితో వ్యవహరించి కారులో ఉన్న ముగ్గురు చిన్నారులతో సహా కుటుంబం మొత్తాన్ని సురక్షితంగా కాపాడారు. వరద ఉద్ధృతి తగ్గిన అనంతరం ఎక్స్కవేటర్ సాయంతో కారును నాలా నుంచి బయటకు తీశారు. గురువారం రాత్రికి కూడా ఇదే ప్రాంతంలో కారు కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో వెళ్లాలంటే వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు.