Fake Gold Biscuits : బంగారు బిస్కెట్లు ఉన్నాయంటూ నమ్మించి తక్కువ ధరకు అమ్ముతానంటూ బురిడీ కొట్టించేందుకు యత్నించిన మోసగాడిని ఓ వ్యాపారి అత్యంత చాకచక్యంగా పోలీసులకు పట్టించాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడిని రిమాండ్‌కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, టోలీచౌకీ సమీపంలోని అరవింద్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న వ్యాపారి అబ్దుల్లా ఇబ్రహీంకు ఈ నెల 6న రాజస్థాన్‌కు చెందిన ఇనాముల్ హసన్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తన వద్ద 8 కేజీల బంగారం ఉందని, దాన్ని కేవలం రూ.2 కోట్లకే అమ్ముతానంటూ చెప్పాడు. తన వద్ద అంత డబ్బు లేదని, తనకు ఫోన్ చేయొద్దని వ్యాపారి సమాధానం ఇచ్చాడు. అయినా సరే వినకుండా పలుమార్లు ఇనాముల్ హసన్ ఫోన్ చేస్తుండటంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇదే క్రమంలో గురువారం రాత్రి మరోసారి ఇనాముల్ హసన్ వ్యాపారికి ఫోన్ చేశాడు. తాను హైదరాబాద్‌కు వచ్చానని, తన వద్ద ఒక కేజీ బంగారు కడ్డీలు ఉన్నాయని చెప్పాడు. దీంతో అతడిని ఎలాగైనా పోలీసులకు పట్టించాలని నిర్ణయించుకున్న అబ్దుల్లా ఇబ్రహీం, అతడితో బేరం చేయసాగాడు. నాణ్యత పరీక్ష చేసిన తర్వాతనే కొంటానంటూ మెలికపెట్టాడు. దీంతో గురువారం రాత్రి రెండు బంగారం బిస్కెట్లు తీసుకువచ్చిన ఇనాముల్ హసన్ వాటిని పరీక్షించుకోవాలని చెప్పాడు.