Old Man Cheated by Two Ladies in The Name of Marriage :80 ఏళ్ల వయసు ఉన్న ఒక వృద్ధుడిని పెళ్లి చేసుకుంటామని నమ్మించి మ్యాట్రిమోనీకి చెందిన నిర్వాహకురాలితో పాటు మరో మహిళ మోసగించిన ఘటన సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పెళ్లి కోసం మంగళసూత్రం కొనుగోలు చేస్తామని చెప్పి వృద్ధుడి నుంచి క్రెడిట్ కార్డు తీసుకుని, రూ.1,77,000 విలువ చేసే తాళి తీసుకుని పరారవడంతో బాధితుడు మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు, రిటైర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్‌గా పని చేసిన చిన్న కొండయ్య భార్య 10 సంవత్సరాల క్రితం చనిపోయింది. అతనికి సంతానం లేకపోవడంతో మధిరలోని జమాలపురంలో ఆశ్రమంలో ఉంటున్నాడు. తన ఆలనా పాలనా చూసేందుకు ఎవరూ లేరని కలత చెందిన చిన్న కొండయ్య వృద్ధుడైనప్పటికీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు ఇటీవల పత్రికలో ప్రకటన కూడా ఇచ్చాడు. అది చూసి ఓ మ్యాట్రిమోనీకి చెందిన మహిళ అతన్ని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంది. మ్యాట్రిమోనీకి చెందిన ఓ నిర్వాహకురాలితో పాటు సరస్వతి అనే మరో మహిళ చిన్న కొండయ్యను పెళ్లి చేసుకునేందుకు దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ లాడ్జికి వచ్చారు. వృద్ధుడిని అక్కడకు రప్పించుకుని, పెళ్లి కోసం మాట్లాడుకున్నారు.
ఈ క్రమంలోనే పెళ్లికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసేందుకు సికింద్రాబాద్‌లోని చందన బ్రదర్స్‌కు వచ్చి చిన్న కొండయ్య క్రెడిట్ కార్డుతో డబ్బులు డ్రా చేసి మంగళసూత్రం కొనుగోలు చేశారు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. రూ.లక్షా 77 వేలు క్రెడిట్ కార్డు నుంచి డ్రా చేసినట్లు మెసేజ్ రావడంతో కంగుతున్న చిన్న కొండయ్య, అనంతరం ఆ ఇరువురి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.