76 Years For Veera Bairanpally Massacre :భారతావనికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం రాగా, తెలంగాణకు 1948 సెప్టెంబరు 17న విమోచనం కలిగింది. స్వాతంత్య్రం వచ్చాక కూడా 13 నెలల పాటు ఈ ప్రాంతం నిజాం రాక్షస పాలనలో కొనసాగింది. వీరికి వ్యతిరేకంగా అప్పట్లో తెలంగాణ సాయుధ పోరాటం ఉవ్వెత్తున ఎగిసింది. ఇదే ఏడాది ఆగస్టు 27న జరిగిన బైరాన్‌పల్లి ఘటన చరిత్రకెక్కని గాథగా మిగిలింది. ఆ రోజు గ్రామానికి చెందిన 96 మంది యోధులను ఒకే వరుసలో నిలబెట్టి నిజాం సైనిక అధిపతి ఖాసీం రజ్వి సారథ్యంలో రజాకార్లు కాల్చిచంపారు.
ఈ ఘటన జరిగి నేటికి సరిగ్గా 76 ఏళ్లు. ఖాసీం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు అరాచకాలు సృష్టించారు. సిద్దిపేట జిల్లాలోని మద్దూరు, లద్నూరు, సలాఖపూర్, రేబర్తి గ్రామాలను రజాకార్లు కేంద్రాలుగా చేసుకొని సమీప గ్రామాల్లో దాడులకు తెగబడుతూ సంపదను దోచుకునేవారు. ఈ అరాచకాలను ఎదిరించేందుకు గ్రామాల్లోని యువతంతా కలిసి రక్షణ దళాలుగా ఏర్పడ్డారు. బైరాన్‌పల్లి, కూటిగల్, లింగాపూర్, దూల్మిట్టలో ఈ రక్షక దళాలు బైరాన్‌పల్లిని కేంద్రంగా పని చేశాయి.
రక్షణకై, పోరుకై స్థావరంగా బురుజు : 1948 ఆగస్టులో రజాకార్లు లింగాపూర్, ధూల్మిట్ట గ్రామాలపై దాడి జరిపి తగులబెట్టారు. తిరిగివెళ్తున్న క్రమంలో బైరాన్‌పల్లి సమీపంలోకి రాగానే వారిపై సమరయోధులు దూబూరి రాంరెడ్డి, ముకుందరెడ్డి, మురళీధర్‌రావు నాయకత్వంలో రక్షణ గెరిల్లా దళాలు దాడిచేసి దోచుకున్న సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో రజాకార్లు బైరాన్‌పల్లి గ్రామంపై మరింత కసి పెంచుకున్నారు. గ్రామస్థులు ఊరి చుట్టూ గోడ ఏర్పాటు చేసి మధ్యలో ఉన్న ఎత్తయిన బురుజును స్థావరంగా చేసుకుని రక్షించుకున్నారు. రజాకార్లు రెండు సార్లు దాడికి ప్రయత్నించి విఫలమయ్యారు.