NDRF Deployed for Relief Operations in Andhra Pradesh :నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైకి 280 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 320 కిలోమీటర్లు.. నెల్లూరుకు 370 కిలోమీటర్ల మేర దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయవ్య దిశగా 15 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది.
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాల్లో ఆకస్మిక వరద వచ్చే ఛాన్స్ ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఇప్పటికే సహాయక చర్యల కోసం జిల్లాల్లో 5ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అవసరమైన చోట పునరావాస సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
సీమ జిల్లాల్లో జోరు వానలు :బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాయలసీమ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కడప, అన్నమయ్య, ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జోరువానలతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. తిరుమలలో రెండో రోజూ ఎడతెరిపిలేని వర్షంతో భక్తులకు ఇక్కట్లు తప్పలేదు.