Baby Boy Killed Pet Dog Attack in Vikarabad : వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం జరిగింది. పెంపుడు శునకం దాడిలో ఓ శిశువు మృతి చెందింది. వివరాల్లోకి వెళితే, తాండూర్ మండలం గౌతపూర్ సమీపంలోని నాగభూషణం నాపరాతి పాలిష్ యూనిట్లో మహబూబ్నగర్ జిల్లాకు చెందిన దంపతులు దత్తు-లావణ్య కూలీలుగా పని చేస్తున్నారు. వీరికి 5 నెలల బాబు సాయినాథ్ ఉన్నాడు. భర్త యూనిట్లో పని చేస్తుండగా, భార్య యూనిట్ బయట వస్తువులు కొనటానికి వెళ్లింది. ఇంతలోనే అదే యూనిట్లో యజమాని పెంచుకున్న శునకం ఇంట్లోకి వెళ్లింది.
ఇంట్లో ఆడుకుంటున్న పసికందుపై విచక్షణారహితంగా దాడి చేసింది. శిశువు అరుపులు విన్న తల్లిదండ్రులు పరుగున ఇంట్లోకి వచ్చి చూసేసరికి బాలుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే తాండూర్ జిల్లా ఆసుపత్రిలోని మాతా-శిశు సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లగా, బాబును పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అప్పటి వరకు తల్లి పొత్తిళ్లలో హాయిగా ఆడుకుంటూ ఉన్న చిన్నారి, అంతలోనే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, విషయం తమ మీదకు రాకుండా యూనిట్ యజమాని బాబును చంపిన కుక్కను చంపేశాడు. సమాచారం తెలుసుకున్న కారణకోట్ ఎస్సై విఠల్ రెడ్డి తన బృందంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాబు తల్లి లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.