Sun Stroke Death Increasing in Telangana : రాష్ట్రంలో వారం నుంచి భానుడి భగభగలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మరణించారు. ముఖ్యంగా జగిత్యాల, కరీంనగర్ జిల్లాలు ఉడికిపోయాయి. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్, ధర్మపురి మండలం జైన, కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.8 డిగ్రీల గరిష్ఠ ఎండ కాసింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, నల్గొండ జిల్లా తెల్దేవరపల్లిలో 46.7 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లా జాకోరా, నారాయణపేట జిల్లా ఊట్కూరులో 46.4ల ఉష్ణోగ్రత, నారాయణపేట జిల్లా కృష్ణా మండల కేంద్రం, మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల కేంద్రంలో 46.3 డిగ్రీలు, నల్గొండ జిల్లా బుగ్గబావిగడ్డలో 46.2 ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా, రాష్ట్రంలోని 22 జిల్లాల్లోని 95 మండలాల్లో వడగాలులు వీచాయి.
పడిపోతున్న తేమ శాతం:వాతావరణం చల్లగా ఉండాలంటే గాలిలో తేమ శాతం సమంగా ఉండాలి. కనీసం 50 శాతం ఉన్నావేడి తీవ్రత అంతగా ఉండదు. రాష్ట్రంలో తేమ శాతం కనిష్ఠ స్థాయికి పడిపోయింది. దీని వల్ల వాతావరణం పొడిబారి ఉష్ణతాపానికి దారితీస్తోంది. శనివారం రాష్ట్రంలో అత్యల్పంగా హైదరాబాద్‌లో 15 శాతం, మహబూబ్‌నగర్‌లో 19 శాతం నమోదైంది. ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ దాటితే శరీరం ఆ ఉష్ణానికి ప్రభావితమవడం ప్రారంభవుతుందని నిపుణులు అంటున్నారు. దీనినే వెట్‌బల్బ్ టెంపరేచర్‌గా పేర్కొన్నారు.
ఈ సమయంలో శరీరాన్ని చల్లబర్చేందుకు చెమట వస్తుందని, తగినంత ద్రవాలు తీసుకోకపోతే వడదెబ్బకు గురవుతారని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వెట్‌బల్బ్ టెంపరేచర్‌కు దాదాపు 9 డిగ్రీలపైన ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భానుడి తీవ్రతతో గాలిలో తమ శాతం తగ్గిపోయింది. దీంతో వాతావరణం పొడిబారి వేడి అధికంగా ఉంటోంది. ఆదివారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి.
కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణానికి చెందిన ఎంఈవో బత్తుల భూమయ్య(57) శనివారం తెల్లవారుజామున వడదెబ్బతో మరణించారు. ఆయన జగిత్యాల జిల్లా వెల్గటూర్, ధర్మపురి, బుగ్గారం, ఎండపల్లి మండలాల ఎంఈవోగా, వెల్గటూర్ మండలంలోని ముత్తునూరు, ముక్కటరావుపేట, కప్పారావుపేట గ్రామాల ప్రత్యేకాధికారిగా పని చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా ధర్మపురి నియోజకవర్గంలో ఫ్లయింగ్ స్క్వాడ్‌గా విధులు చేస్తున్నారు. శుక్రవారం విధులు ముగించుకొని అస్వస్థతతో ఇంటికి చేరుకున్న ఆయన రాత్రి వాంతులు, విరేచనాలతో బాధపడుతూ పరిస్థితి విషమించి మరణించారు.
నిప్పులు కురిపిస్తున్న భానుడు - ఆల్‌టైం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు - high temperatures in telangana