Uranium Mining in Kurnool District : కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలను అడ్డుకునేందుకు స్థానికులు సిద్ధమౌతున్నారు. దేవనకొండ మండలంలోని 15 గ్రామాలకు చెందిన ప్రజలు కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలోని చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద సమావేశం అయ్యారు. కప్పట్రాళ్ల రక్షిత అడవిలో కేంద్ర ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు 68 బోర్లకు అనుమతులు ఇవ్వడంపై చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. తవ్వకాలకు అనుమతిస్తే అన్ని విధాలుగా నష్టపోతామని ప్రజలు వాపోయారు. యురేనియం అనుమతులు రద్దు చేయాలని, లేదంటే ఉద్యమిస్తామని స్థానిక ప్రజలు హెచ్చరించారు.
ఈ సందర్భంగా యురేనియం తవ్వకాలపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ఎదుర్కొనేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. కమిటీ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వ పెద్దలు సహా సామాజిక కార్యకర్తలు, న్యాయ సలహాదారులను కలిసి వారి సూచనలకు అనుగుణంగా ఉద్యమాన్ని నిర్వహించాలని నాయకులు పిలుపునిచ్చారు. అనంతరం కప్పట్రాళ్ల బస్టాప్ వద్ద గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. యురేనియం తవ్వకాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామస్థుల ఆందోళనతో కర్నూలు-బళ్లారి రహదారిపై రాకపోకలు స్తంభించాయి.
కప్పట్రాళ్ల అడవుల్లో 'యురేనియం' అలజడి - కొండపై ఆలయం పక్కనే తవ్వకాలు!
"2018 నుంటి 2023 వరకు మా గ్రామ పరిధిలో యూరేనియం నిల్వలు ఉన్నట్టు తవ్వకాలు చేశారు. సుమారు 40 బోర్లు వేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇక్కడ మైనింగ్ తవ్వకాలకు అనుమతి అడిగితే కేంద్రం సైతం అనుమతి ఇచ్చింది.కప్పట్రాళ్ల అటవీ ప్రాంతం చుట్టూ పక్కల సుమారు 15 గ్రామాలు ఉన్నాయి. యూరేనియం తవ్వకాల వల్ల అనేక ఇబ్బందుల ఉంటాయి. అందుకే వ్యతిరేకిస్తున్నాం. ఇందుకోసం ఒక కమటీని సైతం ఏర్పాటు చేయాలని తీర్మానం చేశాం. అవసరమైతే కోర్టుల్లో పోరాడతాం." - చెన్నమ నాయుడు, కప్పట్రాళ్ల సర్పంచ్