AP Cabinet Meeting Key Decisions :ఏపీలో ప్రభుత్వ, పట్టా భూముల ఆక్రమణలకు పాల్పడిన వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూకబ్జాదారులకు భారీ జరిమానా, 14 ఏళ్లు జైలుశిక్ష వేయనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న భూ ఆక్రమణల నిరోధక చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్త బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఇష్టానుసారం భూకబ్జాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు, భారీ జరిమానాలు ఉండనున్నాయి.
పాత చట్టం కన్నా కొత్త చట్టం భేష్ : ఏపీ భూఆక్రమణల నిరోధక చట్టం -1982ను రద్దు చేసి, దాని స్థానంలో ఏపీ భూ ఆక్రమణల నిరోధక చట్టం -2024 అమలుకు బిల్లు ప్రవేశపెట్టే ప్రతిపాదనకు ఏపీ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం పాత చట్టంలోని ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఆక్రమించుకోవడం, ఎక్కడో దూరంగా ఉంటున్న వారి భూములను కబ్జా చేయడం, పేదల భూములు లాక్కోవడం, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయడం వంటి వాటిని నిరోధించేది. ఇప్పుడు ఈ చట్టానికి కొన్ని మార్పులు తీసుకొచ్చింది.
పాత చట్టం పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులకే పరిమితం అవ్వగా, దాని ద్వారా రూ.5 వేల వరకు జరిమానా, ఆర్నెల్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష మాత్రమే విధించేవారు. కానీ కొత్త చట్టం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని భూములు రక్షణకు వీలుంటుంది. ఆక్రమణదారులకు 10 నుంచి 14 ఏళ్ల వరకు జైలు శిక్ష, పరిహారం, భూమి విలువతో పాటు జరిమానా విధించనున్నారు. దీనికి ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయనున్నారు. నిర్ణీత కాలంలో కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నారు.