Yuvraj Singh Father Yograj Singh : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ మరోసారి వార్తలోకెక్కారు. తాజాగా ఓ వీడియోలో ఆయన తన చిన్నప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు. తన తండ్రి ఓ పులిని చంపిన తీరును కూడా ఆయన పేర్కొన్నారు. వీటితో పాటు తన అకాడమీ గురించి కూడా చెప్పుకొచ్చారు. "మీ అకాడమీలో జాయిన్ కావాలంటే మేం ఎలాంటి మైండ్‌సెట్‌తో ఉండాలి?" అంటూ ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు యోగ్‌రాజ్ ఇలా బదులిచ్చారు.
"ఎవరైనా సరే మొదట తమలో ఉన్న ప్రాణ భయాన్ని వీడాలి. నా జీవితంలో జరిగిన ఓ ఘటన గురించి మీతో చెప్తాను. నాకు మూడేళ్ల వయస్సున్నప్పుడు మా నాన్న నన్ను అలాగే మా అమ్మను పులి వేటకు తీసుకెళ్లారు. అప్పుడు మా అమ్మ ఎంతో భయపడ్డారు. దానికి మా నాన్న "ఒక వేళ అతడు (నేను) చనిపోతే పెద్దగా తేడా ఏమీ ఉండదు. అయితే, అతడ్ని టైగర్‌గా మారుస్తా" అని అన్నారట. ఆ మూడేళ్ల బాలుడిగా ఉన్న నేను తల్లి పక్కన కూర్చొని తండ్రితో అడవికి వెళ్లాను. మా నాన్న ఓ పెద్ద రైఫిల్‌ను పట్టుకొచ్చారు. రాత్రి సమయంలో మేమందరం ఓ మంచెపై కూర్చున్నాం. అదే సమయంలో ఓ పులి మా దగ్గరికి వచ్చింది. దాన్ని చూసి నేను ఒక్కసారిగా అరిచా. వెంటనే మా అమ్మ తన చేతితో నా నోరు మూసేసింది. కేవలం ఆరు అడుగుల దూరంలోనే మా నాన్న ఆ పులికి రైఫిల్‌ను ఎక్కుపెట్టారు. సరిగ్గా తలమీదకి గురిపెట్టి దాన్ని కొట్టారు. దీంతో ఆ పులి వెంటనే కిందికి పడిపోయింది. అదంతా చూసి నాకు మాటలు రాలేదు. నన్ను కిందికి దించమని మా అమ్మకు చెప్పారు. టైగర్ పిల్ల గడ్డి తినదని నాతో అన్నారు. ఆ మాటలు అక్కడంతా మారుమోగిపోయినట్లు అనిపించాయి నాకు. ఆ తర్వాత ఆ పులి మీద నన్ను కూర్చోబెట్టారు. ఆ పులి రక్తాన్ని నాపై చిమ్మారు. ఆ సమయంలో తీసిన ఫొటో ఇప్పటికీ మా ఇంట్లో ఉంది. నేను నా అకాడమీని కూడా అలాగే రన్ చేస్తున్నాను. యువరాజ్ సింగ్‌ను కూడా అలాగే పెంచాను. తను నిర్భయంగా ఎలా ఉండాలో నేర్పించాను అంటూ యోగ్‌రాజ్ వెల్లడించారు.