India vs England 1st ODI : ప్రస్తుత కాలంలో టీమ్ఇండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అత్యుత్తమ ప్లేయర్లు అని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే పన్నెండేళ్ల కిందటే ఈ ఇద్దరు స్టార్లు కాదని ఇప్పుడే వాళ్లు ఆ స్థాయికి ఎదిగినట్లు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ గుర్తుచేశాడు. ఇప్పుడు రోహిత్ - విరాట్ లాగా యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ కనిపిస్తున్నారంటూ వ్యాఖ్యానించాడు.
"2013లో విరాట్, రోహిత్ ఏ వయసులో అయితే ఉన్నారో యశస్వి- గిల్ ఇప్పుడు అలానే ఉన్నారు. ప్రస్తుతం యశస్వి ఇంకొంచం పిల్లాడు. కానీ బ్యాటింగ్‌లో మాత్రం వారికి ఏమాత్రం తీసిపోడని నా అభిప్రాయం. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఇద్దరూ ఎంతో అద్భుతమైన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. అందుకే, కొత్త తరం భారత క్రికెట్‌కు ఈ ఇద్దరూ స్టార్లు" అంటూ బంగర్ పేర్కొన్నాడు.
ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆడగలడు : సంజయ్ మంజ్రేకర్
"గతంలో జరిగిన ఆస్ట్రేలియా టూర్‌కు శుభ్‌మన్ గిల్ నంబర్ 1 ఛాయిస్‌గా ఉండేవాడు. అయితే ఇప్పుడు నాణ్యమైన ఆటతీరుతో యశస్వి దూసుకొచ్చాడు. జైస్వాల్ ఫిట్‌నెస్ కూడా చాలా బాగుంది. బ్యాటింగ్‌లో అతడి దూకుడు కూడా సూపర్‌గా ఉంది. అందుకే, భవిష్యత్తులో భారత విజయాల్లోనూ, అత్యధిక పరుగులు చేయడంలోనూ జైస్వాల్ ముందుంటాడని నేను అనుకుంటున్నాను. టీమ్ అవసరాలకు తగ్గటుగా సమయస్ఫూర్తితో పరుగులు చేస్తుంటాడు. దూకుడుగా ఆడాలంటే తప్పకుండా ఆడుతాడు. మ్యాచ్‌ను డ్రా చేసేందుకు ట్రై చేయాలంటే అలాగే చేస్తాడు. బంతిని ఆలస్యంగా ఆడటం, బ్యాక్ ఫుట్ మీద షాట్లు కొట్టడం కూడా బాగుంటుంది. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గిల్ ఆధిపత్యాన్ని చలాయిస్తాడు. ఇప్పటివరకు టెస్టుల్లోనే యశస్వి అద్భుతంగా ఆడాడు. వన్డేల్లో ఇంకా డెబ్యూట్ చేయలేదు. టీ20ల్లో అతడి సత్తా ఇంకా మనం చూడలేదు. కానీ తప్పకుండా బయటకొచ్చే సమయం వస్తుంది" అని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.