Yash Dayal IPL 2024:2023 ఐపీఎల్‌లో ఓ మ్యాచ్‌లో యంగ్ బ్యాటర్ రింకూ సింగ్ వరుసగా 5 సిక్స్‌లు బాది వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే టీమ్ఇండియాలోనూ అరంగేంట్రం చేశాడు. అయితే ఆ ఓవర్ బౌలింగ్ చేసి 30కి పైగా పరుగులు సమర్పించుకున్న బౌలర్ యశ్ దయాల్ మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఇక గుజరాత్ ఫ్రాంచైజీ కూడా ఆతడిని వదులుకుంది. దీంతో 2024 వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం దయాల్‌పై నమ్మకముంచి అతడిని ఏకంగా రూ. 5కోట్లకు కొనుగోలు చేసింది.
అయితే ప్రస్తుత సీజన్‌లో సోమవారం జరిగిన ఆర్సీబీ- పంజాబ్ మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన దయాల్ 5.80 ఎకనమీతో 23 పరుగులిచ్చి ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలో అతడిపై పలువురు మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు ఆర్సీబీ కూడా తమ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లో దయాల్‌ను ప్రశంసించింది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం దయాల్ గత సీజన్‌లో ఎదురైన చేదు అనుభవాలను షేర్ చేసుకున్నాడు. 2023లో రింకూ 5 సిక్స్‌లు బాదిన తర్వాత 2-3 రోజులు తనకు అనారోగ్యానికి గురైనట్లు గుర్తుచేసుకున్నాడు.
ఐదు సిక్సులు కొట్టిన మ్యాచ్ తర్వాత ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదని పేర్కొన్నాడు. కొందరి సూచనతో సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని చెప్పాడు. 'నిజం చెప్పాలంటే, మ్యాచ్ ముగిసి నేను గ్రౌండ్ నుంచి బయటకు వచ్చినప్పుడే సమస్య మొదలైంది. నాకు సోషల్ మీడియా చెక్ చేయవద్దని చెప్పారు. నేను చివరికి సోషల్ మీడియా చూశాను. తర్వాత మా కుటుంబ సభ్యులతో మాట్లాడాను. ఆ సంఘటన జరిగిన 2-3 రోజుల తర్వాత నేను అనారోగ్యానికి గురయ్యాను. ఇలాంటివి ఎదుర్కొనే మొదటి వ్యక్తిని నేనే కాదు, చివరి వ్యక్తిని కూడా కాను. నేను క్రికెట్‌పై దృష్టి సారించాను. వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడేందుకు ప్రయత్నించాను. అలాంటి పరిస్థితులను సామర్థ్యం సాధించాను' అని అన్నాడు.