WPL 2024 Mumbai Indians Sajeevan Sajana : సజీవన్ సజన - మహిళల ప్రిమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్-2 ప్రారంభం అయ్యే వరకు ఎవరికీ ఈ పేరు తెలీదు. అయితే ఇప్పుడు ఆడింది ఆమె ఒకే బంతి అయినా ఒకే ఒక్క సిక్సర్‌తో తన పేరు మార్మోగేలా చేసింది. ముంబయి ఇండియన్స్ - దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్సర్ బాది దిల్లీని కంగుతినిపించింది సజన. దీంతో అందరి దృష్టి ఆమెపైనే పడింది.
నాన్న ఆటోవాలా :కేరళకు చెందిన యువతి సజన. ఈమె వయసు 29 ఏళ్లు. పేద కుటుంబం ఈమెది. నాన్న సజీవన్ ఆటో నడిపితేనే ఇల్లు గడిచేది. అయితే సజనకు క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్, ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఎంట్రీ ఉంది. వాయనాడ్ జిల్లా ఫుట్‌బాల్ జట్టుకు సారథిగా వ్యవహరించింది. అయితే క్రికెట్ అంటే ఆమెకు ఎక్కువ ఇష్టం. ఇంటి దగ్గర పొలంలో కొబ్బరి మట్టనే బ్యాట్‌గా మలుచుకుని ఆడేది. అలా ఆమె ఆసక్తిని గుర్తించాడు ఆటోవాలా తన నాన్న. ఆమెను ప్రోత్సహించడం మొదలుపెట్టాడు. పాఠశాల పీఈటీ ఎల్సమ్మ కూడా ఈమెను ప్రోత్సాహించింది.
మలుపు తిరిగింది : కృష్ణగిరి స్టేడియంలో ఒకరోజు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను కలిసే అవకాశం సజనకు వచ్చింది. ఇది ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అతడిచ్చిన స్ఫూర్తితో పట్టుదలగా ఆడడం మొదలుపెట్టింది. వాయనాడ్ జిల్లాకు అండర్-19లో ప్రాతినిథ్యం వహించి - స్థిరంగా ఆడుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. మొదట్లో రోజుకు రూ.150 జీతం వస్తేనే గొప్పగా భావించిన ఆమె ఆ తర్వాత క్రికెట్లో కేరళ అండర్-19 కెప్టెన్‌గా ఎదిగింది. బలంగా పొడవుగా ఉండే ఈమె హిట్టర్‌గా పేరు సంపాదించుకుంది. ఆఫ్ స్పిన్నర్‌గానూ రాణించింది.