WPL 2024 GG VS MI :డబ్ల్యూపీఎల్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్ జట్టు ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(95*) తన బ్యాటింగ్‌తో అదరగొట్టింది. బౌండరీల మోత మోగించింది. దీంతో ఒక్క బంతి మిగిలి ఉండగానే ముంబయి విజయం సాధించింది.
భారీ లక్ష్ యఛేదనలో ముంబయి ఇండియన్స్ జట్టు ఓపెనర్ యాస్తికా బాటియా (49) రాణించింది. మ్యాథ్యూస్ (18), నాట్ సీవర్ (2) విఫలం కావడంతో హర్మన్ ప్రీత్, అమేలియా కెర్ (12*)తో కలిసి లక్ష్యాన్ని పూర్తి చేసింది. గుజరాత్ బౌలర్లలో షబ్నమ్, తనూజా కన్వర్, ఆష్లీ గార్డనర్ ఒక్కో వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. బెత్ మూనీ (66; 35 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), దయాళన్ హేమలత (74; 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో చెలరేగారు. భారతి ఫుల్మాలి (21*; 13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) రాణించింది. ఓపెనర్ లారా వోల్వార్ట్ (13) నిరాశపర్చినా బెత్ మూనీ, హేమలత దూకుడుగా ఆడారు.
వీరిద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 10 ఓవర్లకే స్కోరు 100 దాటింది. మూనీ 27 బంతుల్లో, హేమలత 28 బంతుల్లో అర్ధ శతకాలు అందుకున్నారు. పుజా వస్త్రాకర్ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు బాదిన మూనీ, సజనా వేసిన తొలి ఓవర్‌లో మొదటికే పెవిలియన్ చేరింది.
తర్వాత గుజరాత్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో స్కోరు వేగానికి బ్రేకులు పడ్డాయి. లిచ్‌ఫీల్డ్ (3), ఆష్లీ గార్డ్‌నర్ (1) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కాసేపటికే షబ్నిమ్ బౌలింగ్‌లో హేమలత ఔటైంది. ఆఖర్లో భారతి దూకుడుగా ఆడటంతో గుజరాత్ భారీ స్కోరు సాధించింది. ముంబయి బౌలర్లలో సైకా ఇషాక్ 2, హేలీ మాథ్యూస్, షబ్నిమ్, పుజా వస్త్రాకర్, సజనా తలో వికెట్ పడగొట్టారు.