తెలంగాణ

telangana

ETV Bharat / sports

సడెన్​గా అశ్విన్ రిటైర్మెంట్- వారి వల్లే కెరీర్​కు గుడ్​బై ? - ASHWIN RETIREMENT

అశ్విన్ సంచలన నిర్ణయం వెనుక కారణాలు ఏంటి- ఎందుకు సడెన్​గా రిటైర్మెంట్ ప్రకటించాడు?

Ashwin Retirement
Ashwin Retirement (Source : Associated Press)

By ETV Bharat Sports Team

Published : 5 hours ago

Ashwin Retirement Reason :టీమ్ఇండియా సీనియర్ స్పిన్ మిస్టరీ రవిచంద్రన్ అశ్విన్ బుధవారం అనుహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. బోర్డర్- గావస్కర్​లో గబ్బా వేదికగా మూడో టెస్టు అనంతరం విలేకరుల ముందుకు వచ్చి తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. అయితే అశ్విన్ ఇంత సడెన్​గా సిరీస్‌ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించాడానికి కారణం ఏం ఉంటుందా? అని ఫ్యాన్స్​ ఆలోచిస్తున్నారు. మరి అతడు ఆటకు గుడ్​ బై చెప్పడానికి గల కారణాలు ఏంటంటే?

లెజెండరీ స్పిన్నర్ అశ్విన్ చాలా లోతుగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాడని అర్థమవుతోంది. సొంత గడ్డపై తిరుగులేని అశ్విన్, కొంతకాలంగా విదేశాల్లో రాణించడం లేదు. ప్రస్తుత బోర్డర్- గావస్కర్​లోనూ అశ్విన్ ఆడింది ఒకే మ్యాచ్. అందులోనూ తీసింది కేవలం ఒక్క వికెట్టే. దీనికి తోడు రవీంద్ర జడేజా అతడి స్థానాన్ని భర్తీ చేయడం కూడా అశ్విన్ రిటైర్మెంట్​కు కారణంగా చూడొచ్చు.

గబ్బా టెస్టులో భారత్‌ ఫాలో ఆన్‌ గండాన్ని తప్పించుకుని మ్యాచ్‌ డ్రాగా ముగియడంలో జడేజాది కీలకపాత్ర. జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు 77 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో జడ్డూ హీరోగా నిలిచాడు. దీంతో తర్వాతి రెండు టెస్టుల్లో అతడిని పక్కనపెట్టే పరిస్థితి లేదు. పైగా ఆ మ్యాచ్​లకు ఆతిథ్యమివ్వనున్న మెల్‌బోర్న్‌, సిడ్నీ పిచ్‌లు స్పిన్నర్లకు సహకరిస్తాయనే అంచనాలున్నాయి. దీంతో జడేజాతోపాటు రెండో స్పిన్నర్‌గా బ్యాటర్‌గానూ ప్రభావం చూపే వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

అతడి రాకతో వెనకబడ్డ అశ్విన్‌
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్‌ ఆల్‌రౌండర్‌గా రాణించాడు. దీంతో ఆసీస్​ టూర్​కు సుందర్​ ఎంపికయ్యాడు. ఈ యువ స్పిన్నర్ అశ్విన్‌తో పోలిస్తే బ్యాటింగ్‌లోనూ ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాడు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా అతడిని ప్రోత్సహిస్తోంది. ఆసీస్‌తో తొలి టెస్టులో అశ్విన్‌, జడేజాలను పక్కనపెట్టి సుందర్‌నే ఎంపిక చేశారు. అశ్విన్ స్థానాన్ని సుందర్‌తో భర్తీ చేయాలనేది టీమ్‌ఇండియా ఆలోచనగా అర్థమవుతోంది.

ఇప్పట్లో కష్టమే!
అశ్విన్‌కు భారత్​లో ఘనమైన రికార్డు ఉంది. స్వదేశంలో 65 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్, ఏకంగా 383 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇప్పట్లో టీమ్‌ఇండియాకు స్వదేశంలో టెస్టు సిరీస్‌లు లేవు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో ప్రస్తుత డబ్ల్యూటీసీలో భారత్‌ మ్యాచ్‌లు ముగుస్తాయి. ఇక 2025 డబ్ల్యూటీసీ సైకిల్‌ ఇంగ్లాండ్‌ పర్యటనతో జూన్​లో ప్రారంభం కానుంది.

అక్కడా అశ్విన్​కు పెద్దగా రికార్డు లేదు. కాబట్టి ఇంగ్లాండ్​ సిరీస్​లోనూ అశ్విన్​కు జట్టులో చోటు కష్టమే. ఇక టీమ్ఇండియా స్వదేశంలో టెస్టులు ఆడేది 2025 అక్టోబర్​ నెలలో. అప్పటికి అశ్విన్ 39ఏళ్లు పూర్తి చేసుకుంటాడు. అప్పటికి వయసు, ఫామ్​, జట్టులో చోటు దక్కే అవకాశాలు వీటన్నిటినీ సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాతే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏది ఏమైనా భారత ఆల్‌టైమ్‌ గ్రేట్‌ క్రికెటర్లలో అశ్విన్ ఒకడు. 106 టెస్టుల్లో 537, 116 వన్డేల్లో 156, 65 టీ20లు ఆడి 72 వికెట్లు పడగొట్టాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 3503 పరుగులు చేసిన అతడు ఆరు సెంచరీలు, 14 అర్ధ శతకాలు బాదాడు.

రవిచంద్రన్ అశ్విన్ టాప్ 10 రికార్డ్స్​ ఇవే

అశ్విన్ రిటైర్మెంట్​తో విరాట్ ఎమోషనల్ పోస్ట్- ఆ రోజులన్నీ గుర్తొచ్చాయట!

ABOUT THE AUTHOR

...view details