Rohit Border Gavaskar Trophy 2024:2024 బోర్డర్ గావస్కర్ ట్రోఫీ నవంబర్‌లో ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ఆస్ట్రేలియా గడ్డపై జరగాల్సి ఉంది. టెస్టుల్లో వరుస విజయాలతో జోరుమీదున్న భారత్, ఆసీస్ గడ్డపై కూడా సత్తా చాటాలని భావిస్తోంది. ఈ సిరీస్‌లో అత్యధిక మ్యాచ్‌లు నెగ్గి వరల్డ్‌టెస్టు ఛాంపియన్షిప్ 2025 ఫైనల్‌కు అర్హత సాధించాలని భావిస్తోంది.
అయితే ఈ సిరీస్‌లో తొలి లేదా రెండో మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండకపోవచ్చని ప్రచారం సాగుతోంది. వ్యక్తిగత కారణాల వల్ల, ఆసీస్ సిరీస్‌లో ఏదో ఒక మ్యాచ్‌కు దూరంగా ఉంటాడని అంటున్నారు. ఒకవేళ రోహిత్ ఒక మ్యాచ్‌కు దూరమైతే టీమ్ఇండియాను ఎవరు నడిపిస్తారు? జట్టుకు కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
- బుమ్రా: రోహిత్ కెప్టెన్‌గా ఉంటే, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టెస్టుల్లో ఇప్పటికే టీమ్ఇండియా వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బుమ్రానే భారత జట్టు వైస్ కెప్టెన్. అంతకుముందు ఇంగ్లాడ్ (2022)తో టెస్టు మ్యాచ్‌లో బుమ్రా కెప్టెన్‌గానూ ఉన్నాడు. అయితే ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్ టెస్టులో మాత్రం బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ప్రకటించలేదు. ఆ సిరీస్‌లో రోహిత్ ఒక్కడినే కెప్టెన్‌గా నియమించిన బీసీసీఐ, మిగతవారిని ప్లేయర్లుగానే పరిగణించింది. కానీ, ఈసారి బుమ్రాను కెప్టెన్‌గా ఎంపికచేసే ఛాన్స్ లేకపోలేదు.
- రిషబ్ పంత్: టీమ్ఇండియా యంగ్బ్యాటర్ రిషబ్ పంత్ రీ ఎంట్రీలో అదరగొడుతున్నాడు. అటు బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌తో మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ స్థానాన్ని భర్తీ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పంత్ టీమ్ఇండియా ఫ్యూచర్ కెప్టెన్ అని పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు. అలా పంత్ కూడా కెప్టెన్సీ రేస్‌లో ఉంటాడనే చెప్పవచ్చు.
- కేఎల్ రాహుల్:ప్రస్తుత టీమ్ఇండియాలో రోహిత్, విరాట్ కోహ్లీ తర్వాత సీనియర్ కే ఎల్ రాహుల్. రీసెంట్గా బంగ్లాతో సిరీస్‌లో రాణించలేకపోయినప్పటికీ, ఆసీస్ పర్యటనకు ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. అలా రాహుల్‌కు కూడా జట్టుకు సారథ్యం వహించే అవకాశం రావచ్చు. అయితే రోహిత్ శర్మ ఎలాంటి విశ్రాంతి తీసుకోకపోతే మాత్రం అతడే టీమ్ఇండియా కెప్టెన్. చూడాలి మరి ఏం జరుగుతుందో?