Team India Batting Coach :టీమ్ఇండియా బ్యాటర్ల ప్రదర్శన బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కాస్త ఆకట్టుకున్నా, మళ్లీ వైఫల్యాల బాట పట్టారు. చెత్త షాట్లు ఆడుతూ వికెట్లు సమర్పించుకుంటున్నారు. తాజాగా గబ్బా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ అదే జరిగింది. టాపార్డర్ బ్యాటర్లు జైస్వాల్, గిల్, విరాట్ కోహ్లీ పేలవ షాట్లతో పెవిలియన్ చేరారు.
పదేపదే అలాంటి షాట్లు ఎంచుకొని కొందరు ప్లేయర్లు వికెట్లు పారేసుకుంటుంటే జట్టులో బ్యాటింగ్ కోచ్ పాత్ర ఏంటని? ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో 'టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్ ఎవరు?' అని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి అసలు భారత క్రికెట్ జట్టు కోచ్ ఎవరో మీకైనా తెలుసా?
కోచింగ్ స్టాఫ్ ఇదే!
2024 టీ20 వరల్డ్‌కప్ తర్వాత మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. అతడికి అసిస్టెంట్ కోచ్‌లుగా రియాన్ టెన్ డెష్కటే, అభిషేక్ నాయర్ ఎంపికయ్యారు. ఇక జట్టుకు బౌలింగ్ కోచ్‌గా ఉన్న పరాస్ మాంబ్రే స్థానాన్ని సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ మోర్నీ మోర్కెల్‌తో భర్తీ చేశారు. ప్రస్తుతం మోర్నీ మోర్కెల్ భారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు.
ఇదీ టీమ్ఇండియా కోచింగ్ స్టాఫ్. ఇందులో రియాన్ టెన్ డెష్కటే, అభిషేక్ నాయర్ హెడ్ కోచ్ గంభీర్‌కు అసిస్టెంట్ కోచ్‌లుగా ఉన్నారు. కానీ, జట్టుకు బ్యాటింగ్ కోచ్ ఎవరో తెలియకపోవడం ఆశ్చర్యకరం! అంటే హెడ్ కోచ్ గంభీర్ ఆధ్వర్యంలో టీమ్ఇండియాకు బ్యాటింగ్ కోచ్ లేడనే చెప్పాలి!