Fire At Cricket Stadium : 2025 లీగ్ బిగ్ బాష్ లీగ్‌లో గురువారం ఓ ఊహించని ఘటన జరిగింది. బ్రిస్బేన్ హీట్- హోబర్ట్ హరికేన్స్ మధ్య రసవత్తరంగా సాగుతున్న మ్యాచ్ ఓ విచిత్రమైన కారణంతో కాసేపు నిలిచిపోయింది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ 201-6 పరుగులు చేసింది. 202 పరుగుల లక్ష్యంతో హోబర్ట్ హరికేన్స్ ఛేజింగ్‌కి దిగింది. రెండో ఇన్నింగ్స్ 4వ ఓవర్ ముగిసే సమయానికి స్టాండ్స్‌లోని డీజే బూత్‌లో చిన్నపాటి ఎలక్ట్రికల్ ఫైర్ మొదలైంది.
ఇప్పటికే లాస్ ఏంజిలెస్‌లో చెలరేగిన కార్చిచ్చు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు పెంచింది. ఈ క్రమంలో మ్యాచ్ మధ్యలో మంటలు వ్యాపించడం వల్ల ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. స్కోరు బోర్డు కింద థర్డ్ టైర్‌లో మంటలు చెలరేగాయి. అక్కడ ఒక వ్యక్తి అగ్నిమాపక యంత్రంతో ఉన్నాడు. కానీ, అతడు మంటలను అదుపు చేయలేకపోయాడు. వెంటనే సమీపంలోని అభిమానులను అక్కడ నుంచి దూరంగా పంపించేశారు. కొద్దిసేపు మ్యాచ్‌ని నిలిపేశారు. ఇక మంటలు ఆర్పిన అనంతరం యథావిధిగా మ్యాచ్ మొదలైంది.
Play was delayed at The Gabba when a fire broke out in the stands. #BBL14 pic.twitter.com/v2J2OktfuF
— KFC Big Bash League (@BBL) January 16, 2025
భారీ ఛేదనలో దిగిన హోబర్ట్ హరికేన్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. కాలేబ్ జావెల్ (76 పరుగులు) చెలరేగాడు. మిచెల్ ఓవెన్ (44 పరుగులు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. అతడు ఏకంగా ఆరు సిక్సులు, ఒక ఫోర్ బాదేశాడు. దీంతో హోబర్ట్ హరికేన్స్ సులువుగా 207 పరుగులు చేసింది.
అంతకుముందు మార్నస్ లబుషేన్ (77 పరుగులు) హాఫ్ సెంచరీతో బ్రిస్బేన్ హీట్ భారీ స్కోరు సాధించింది. మాట్ రెన్ షా 25 బంతుల్లో 40 పరుగులు, టామ్ అల్సోప్ 27 బంతుల్లో 39 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. హోబర్ట్ హరికేన్స్ బౌలర్ నాథన్ ఎల్లిస్ 42 పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా, మిచెల్ ఓవెన్ ఒక వికెట్ తీశాడు.
ఆస్ట్రేలియా ప్రీమియర్ 2025 లీగ్ బిగ్ బాష్ లీగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. లీగ్ దశలో ఇక నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలున్నాయి. ప్రస్తుతం హోబర్ట్ హరికేన్స్ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు బ్రిస్బేన్ హీట్ ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో మూడు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇప్పటికే సిడ్నీ సిక్సర్స్, సిడ్నీ థండర్స్ ప్లేఆఫ్స్‌కి చేరుకున్నాయి.