ICC Champions Trophy White Suit : 2013లో టీమ్ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో ఆ టోర్నీలో విజేతగా నిలిచింది. అయితే కప్పు అందుకునే సమయంలో నిశితంగా గమినిస్తే టీమ్ఇండియా ఆటగాళ్లంతా తెల్ల కోటు వేసుకున్నారు. ఐసీసీ నిర్వహించే వన్డే, టీ-20 ప్రపంచ కప్పుల్లో ఇలాంటి సంప్రదాయం మనకు ఎక్కడా కనపడదు. విజేతగా నిలిచిన జట్టు వారి దేశపు యూనిఫామ్‌తోనే కప్పు అందుకుని సెలెబ్రేషన్స్ చేసుకుంటుంది. అలాంటిది ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఈ ప్రత్యేకత ఎందుకు? అసలు ఈ తెల్లకోటు సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా మొదలైంది దాని వెనక ఉన్న చరిత్ర గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి 14న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఒక స్పెషల్ ప్రోమోను విడుదల చేసింది. ఇందులో పాకిస్థాన్ లెజెండరీ బౌలర్ వసీం అక్రమ్, టోర్నమెంట్ విజేతలు ధరించే తెల్ల సూట్‌ను ఆవిష్కరించారు. దాని మీద ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఛాతీ జేబుపై బంగారు అక్షరాలతో ఆతిథ్య దేశం పాకిస్థాన్ పేరు సైతం ఉంది. టోర్నీలో విజేతలుగా నిలిచి టీమ్ సభ్యులు వీటిని ధరించి సంబరాలు చేసుకుంటారు. వారికి ట్రోఫీతో పాటు ఈ వైట్ బ్లేజర్స్ని అందిస్తారు.
వైట్ సూటే ఎందుకు?
ఇక ఈ టోర్నీలో జట్లు ట్రోఫీ కోసమే కాకుండా, తెల్ల కోట్ కోసం కూడా పోటీ పడతాయని ఐసీసీ తెలిపింది. ఈ వైట్ సూట్ ఆటగాళ్ల గొప్పతనం, దృఢ సంకల్పాన్ని సంగ్రహించే "గౌరవ బ్యాడ్జ్" అని అభివర్ణించింది. ఈ వైట్ సూట్ ఛాంపియన్లు అలంకరించే గౌరవ చిహ్నం. ఇవి ట్రోఫీ కోసం చేసిన అవిశ్రాంత కృషిని, తరతరాలకు స్ఫూర్తినిచ్చే అంశాలను ప్రతిబింబిస్తాయని ఐసీసీ పేర్కొంది. ఫైనల్ గెలిచిన తర్వాత జరిగే వేడుకల్లో ఉత్సాహంగా ధరించే వైట్ సూట్ ఈ టోర్నీ గొప్ప చరిత్రకు ఒక ప్రత్యేకతను జోడిస్తాయి. మిగిలిన జట్లు కూడా మరోసారి పోటీపడేలా ప్రోత్సహిస్తుందని వెల్లడించింది.