West Indies vs England 3rd ODI :బ్రిడ్జ్ టౌన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో 3 వన్డేల సిరీస్ ను 2- 1 తేడాతో విండీస్ జట్టు దక్కించుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. విండీస్ కెప్టెన్ షాయ్ హోప్‌తో విభేదాల కారణంగా ఆ జట్టు స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్ మ్యాచ్ మధ్యలోనే మైదానం నుంచి డగౌట్‌కు వెళ్లిపోయాడు. దీంతో స్టేడియంలో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఇంతకీ ఏం జరిగిందంటే?
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ హోప్ తొలుత ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు శుభారంభం దక్కలేదు. మూడో ఓవర్‌లోనే ఓపెనర్ విల్ జాక్స్ వికెట్ కోల్పోయింది. దీంతో ఫస్ట్ డౌన్‌లో యువ ఆటగాడు జోర్డాన్ కాక్స్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో కాక్స్ కోసం విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ స్లిప్‌లో ఇద్దరు ఫీల్డర్లను సెట్ చేశాడు.
అయితే నాలుగో ఓవర్ బౌలింగ్ చేసేందుకు వచ్చిన జోసెఫ్‌కు ఈ ఫీల్డ్ ప్లేస్‌మెంట్ నచ్చలేదు. దీంతో హోప్‌తో జోసెఫ్ వాగ్వాదానికి దిగాడు. అతడితో గొడవ పడుతూనే ఓవర్‌ను పూర్తి చేశాడు. ఆ ఓవర్‌లో నాలుగో బంతికి కాక్స్‌ను జోసెఫ్ ఔట్ చేశాడు. వికెట్ తీసినప్పటికీ జోసెఫ్ కనీసం సెలబ్రేట్ కూడా చేసుకోలేదు. సహచర ఆటగాళ్లు తన దగ్గరకి వచ్చినప్పటకి జోసెఫ్ మాత్రం సీరియస్‌గా హోప్‌తో తన వాగ్వాదాన్ని కొనసాగించాడు.
అంతటితో ఆగని జోసెఫ్ తన ఓవర్ పూర్తి కాగానే మైదానం విడిచిపెట్టి డగౌట్‌కు వెళ్లిపోయాడు. దీంతో ఒక ఓవర్ మొత్తం విండీస్ జట్టు 10 మందితోనే ఫీల్డింగ్ చేయడం గమనార్హం. ఆ తర్వాత కోచ్ సామీతో సంప్రదింపులు జరిపిన తర్వాత జోసఫ్ మళ్లీ మైదానంలోకి వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అది తప్పు
ఈ మ్యాచ్‌లో కామెంటేటర్‌గా ఉన్న ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ మార్క్ బుచర్ జోసెఫ్ ప్రవర్తనను తప్పుపట్టాడు. కెప్టెన్, ఆటగాడి మధ్య ఏదో ఒక విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయని, అంతమాత్రాన మైదానం వదిలేయకూడదని తెలిపాడు. కెప్టెన్ మిమ్మల్ని ఫీల్డింగ్‌కు తగ్గట్లు బౌలింగ్ చేయమని అడిగితే, అందుకు అనుగుణంగా బంతి వేయాలని అభిప్రాయపడ్డాడు.