Washington Sundar Catch Out Controversy :బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అంపైర్ నిర్ణయం మరోసారి కాంట్రవర్సీకి దారి తీసింది. టీమ్ఇండియా బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ ఔట్ పట్ల థర్డ్ అంపైర్ నిర్ణయంపై కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే థర్డ్ అంపైర్ గత మ్యాచ్‌లో ఒకలా, ఈ మ్యాచ్‌లో మరోలాగా వ్యవహరించారంటూ నెటిజన్లు కూడా మండిపడుతున్నారు.
ఇదీ జరిగింది
సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ ఇన్నింగ్స్‌లో కమిన్స్ వేసిన 66 ఓవర్లో వాషింగ్టన్ సుందర్ (14 పరుగులు, 30 బంతుల్లో) వివాదాస్పద రీతిలో క్యాచ్ ఔటయ్యాడు. కమిన్స్ వేసిన బంతిని సుందర్ థర్డ్ మ్యాన్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాట్‌ను తాకకుండానే బంతి కీపర్ చేతిలో పడింది. దీంతో ఆసీస్ ప్లేయర్లు అప్పీల్ చేశారు. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వగా, ఆసీస్ రివ్యూ కోరింది.
థర్డ్ అంపైర్ పలు యాంగిల్స్‌లో బంతిని పరిశీలించాడు. ఆ బంతి సుందర్ గ్లౌవ్‌ను తాకిందా? లేదా అని స్నికో మీటర్ సాయంతో రిప్లైలో పలుమార్లు పరిశీలించాడు. అయితే అది ఓ యాంగిల్లో తాకనట్లు, మరో యాంగింల్లో తాకినట్లు స్నికో మీటర్ స్పైక్ వచ్చింది. దీంతో అంపైర్ అది ఔట్‌గా ప్రకటించాడు. దీంతో నాన్ స్ట్రైకర్‌గా ఉన్న బుమ్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు.