Virat Kohli Border Gavaskar Trophy : మరికొద్ది రోజుల్లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గావస్కర్ ట్రోఫీ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీమ్ఇండియా బ్యాచ్లవారిగా అక్కడికి చేరుకుంటోంది. అయితే విరాట్ కోహ్లీ మాత్రం అందరికంటే ముందుగానే ఆస్ట్రేలియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఘోర పరాభవాన్ని చవి చూసిన అతడు, ఇప్పుడు ఆసీస్‌తో జరగనున్న పోరులో రాణించాలని తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. ఇక విరాట్‌తో పాటు టీమ్‌ఇండియా యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ కూడా ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు. గత కొంతకాలంగా ఈ స్టార్ ప్లేయర్ టెస్టుల్లో మంచి ఫామ్ కనబరుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు ఆసీస్‌తో జరగనున్న బోర్డర్ గావస్కర్ విషయంలోనూ అతడిపై భారీ అంచనాలున్నాయి.
ఇదిలా ఉండగా, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్‌ను ఆస్ట్రేలియా మీడియా పొగడ్తలతో ముంచెత్తుతోంది. వీరిద్దరిని హైలైట్ చేస్తూ అక్కడి వార్తా పత్రికల్లో ప్రత్యేకమైన కథనాలు ప్రచురితమయ్యాడు. ముఖ్యంగా ప్రముఖ న్యూస్ పేపర్ 'ది డైలీ టెలిగ్రాఫ్'లో కోహ్లీ ఫొటోను ఫ్రంట్ కవర్ పేజీపై ప్రచురించింది. దీంతో పాటు అతడు ఏ ఫార్మాట్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఆడాడు, ఎన్ని పరుగులు చేశాడు. అందులో ఎన్ని సెంచరీలు ఉన్నాయి. అతడి సగటు ఎంత? అనే వివరాలను రాశారు. ఇక అదే వార్తా పత్రిక గతంలో యశస్వి జైస్వాల్ సెంచరీ చేసిన ఫొటోను ప్రచురించి 'కొత్త రాజు' అనే అర్థం వచ్చేలా ఓ హెడ్డింగ్ రాసుకొచ్చింది. దానికి హిందీ, పంజాబీ భాషలోనూ ప్రత్యేకమైన ఫాంట్లను జోడించింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫొటోలను క్రీడాభిమానులు సోషల్ మీడియా వేదికగా తెగ ట్రెండ్ చేస్తున్నారు.