Mohammed Shami IND VS ENG ODI : టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ మళ్లీ బౌలింగ్‌లో రిథమ్‌ను అందుకొన్నాడు. గాయం నుంచి కోలుకొని వచ్చాక ఇంగ్లాండ్‌పై ఆడిన రెండో టీ20లో మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. దాదాపు 15 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన షమీ మునుపటిలా బౌలింగ్ చేయడం అభిమానులను ఆకట్టుకుంది. అయితే ఫిబ్రవరి 6నుంచి ఇంగ్లాండ్ తో భారత్ వన్డే సిరీస్‌లో తలపడనుంది. ఈ క్రమంలో షమీని ఓ రికార్డు ఊరిస్తోంది. అదేంటంటే?
15 నెలల తర్వాత రీఎంట్రీ
ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 6న నాగ్‌పుర్ వేదికగా ఇంగ్లాండ్‌తో టీమ్ఇండియా మొదటి వన్డేలో తలపడనుంది. ఫిబ్రవరి 9న కటక్‌లో రెండో వన్డే, ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో మూడో వన్డే మ్యాచ్ ఆడనుంది. ఈ సిరీస్ ద్వారా మహ్మద్ షమీ దాదాపు 15 నెలల తర్వాత వన్డే క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే వన్డే ఫార్మాట్లో షమీ ఇప్పటివరకు 101 మ్యాచ్‌లు ఆడి 195 వికెట్లు తీశాడు. మరో వికెట్ తీస్తే టీమ్ఇండియా పేసర్ వెంకటేశ్ ప్రసాద్(196)ను దాటేస్తాడు. అలాగే ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో మరో 5 వికెట్లు తీస్తే 200 వికెట్ల క్లబ్‌లోకి చేరుతాడు షమీ. అప్పుడు టీమ్ఇండియా తరఫున 200 వన్డే వికెట్లు తీసిన ఎనిమిదో బౌలర్‌గా నిలుస్తాడు.
భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే :
అనిల్ కుంబ్లే - 334
జవగల్ శ్రీనాథ్-315
అజిత్ అగార్కర్-288
జహీర్ ఖాన్ - 269
హర్భజన్ సింగ్ - 265
కపిల్ దేవ్ - 253
రవీంద్ర జడేజా - 220
వెంకటేశ్ ప్రసాద్ - 196
మహ్మద్ షమీ - 195
షమీ తన చివరి వన్డే మ్యాచ్‌ను 2023 నవంబర్ 19న ఆస్ట్రేలియాతో ఆడాడు. అదే ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్. ఆ మ్యాచ్‌లో టీమ్ఇండియా పరాజయంపాలై వరల్డ్ కప్‌ను చేజార్చుకుంది. ఆ తర్వాత గాయం కారణంగా షమీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఇటీవలే ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో షమీ మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. ఆఖరి రెండు మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఒక మ్యాచ్‌లో వికెట్లేమీ తీయలేదు. మరో టీ20లో మాత్రం మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఫిబ్రవరి 6న జరిగే వన్డే సిరీస్ లో షమీ ఏమాత్రం రాణిస్తాడో వేచి చూడాల్సిందే.