Virat Kohli on Ab De Villiers: సౌతాఫ్రికా మాజీ స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ప్రతిష్ఠాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ 2024లో చోటు సంపాదించాడు. డివిలియర్స్‌తో పాటు ఇంగ్లాండ్‌కు చెందిన అలిస్టర్ కుక్, భారత్ మాజీ మహిళా క్రికటర్ నీతూ డేవిడ్‌కు కూడా ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా దిగ్గజ క్రికెటర్ డివిలియర్స్‌ని అభినందిస్తూ, మాజీ సహచరుడు టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ లేఖ రాశాడు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో డివిలియర్స్ చేరడం తనకు ఎంత గౌరవంగా అనిపించిందని కోహ్లీ తన లేఖలో తెలిపాడు. డివిలియర్స్‌ను అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్‌గా అభివర్ణించాడు. అతడు తన స్కిల్స్‌పై మాత్రమే కాకుండా, సొంత బలాన్ని కూడా నమ్ముతాడని చెప్పాడు.
డివిలియర్స్‌తో కలిసి ఆడిన ఇన్నింగ్స్‌ల్లో తనకు ఇష్టమైన ఒక సందర్భాన్ని విరాట్ లేఖలో రాసుకొచ్చాడు. 2016లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో సునీల్ నరైన్ బౌలింగ్‌లో డివిలియర్స్ బాదిన 94 మీటర్ల సిక్స్‌ను ప్రస్తావించాడు. నాన్‌స్ట్రైకర్స్ ఎండ్‌లో ఉన్న తాను, డివిలియర్స్ సింగిల్ తీస్తాడని భావించాడు. కానీ, డివిలియర్స్ భారీ షాట్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మైదానంలో ఇలాంటి ఊహించని, అపురూపమైన విన్యాసాలు చేయగలగడం డివిలియర్స్‌కి మాత్రమే సాధ్యమని అన్నాడు. అతడు ఒక 'ఫ్రీక్' అని కోహ్లీ ఆప్యాయంగా పిలిచాడు.
డివిలియర్స్ ప్రతిభ
ఎవ్వరికీ సాధ్యం కాని విభిన్న, భారీ షాట్లు ఆడటం మాత్రమే కాదని, ఆపదలో జట్టును ఆదుకోవడం కూడా డివిలియర్స్ ప్రత్యేకత అని విరాట్ అన్నాడు. దూకుడుగా ఆడినా, ఆడకపోయినా అతడికి తన సామర్థ్యంపై ఎప్పుడూ నమ్మకం ఉందని కోహ్లీ కొనియాడాడు. డివిలియర్స్ మ్యాచ్‌పైనే కాకుండా, ప్రేక్షకుల మనసులపై కూడా ప్రభావం చూపగలడనని అన్నాడు. ఈ విధానమే అతడిని ప్రత్యేకంగా నిలబెట్టిందని వివరించాడు. ఇప్పటివరకు తాను కలిసి ఆడిన గొప్ప ఆటగాళ్లలో డివిలియర్స్ ఒకడని పేర్కొన్నాడు.