Virat Kohli Birthday Special :ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తుంటాడు టీమ్ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ. వన్డే, టీ20, టెస్టులాంటి ఫార్మాట్లలో శైలి మార్చుకుంటూ అదరగొడుతుంటాడు. ఇటీవలే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పిన ఈ స్టార్ క్రికెటర్, ప్రస్తుతం వన్డే, టెస్టుల్లోనే కొనసాగుతున్నాడు. కాగా, నేడు (నవంబరు 5) కింగ్ కోహ్లీ బర్త్ డే. ఈ రోజు విరాట్ 36వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలో అభిమానులకు కోహ్లీ తన కెరీర్లో ఆడిన 5 బెస్ట్ నాక్స్ గురించి ఓ లుక్కేద్దాం.
కోహ్లీ విరోచిత ఇన్నింగ్స్
2012లో జరిగిన ఆసియా కప్‌లో మీర్పూర్ వేదికగా దాయాది దేశం పాకిస్థాన్‌తో భారత్ తలపడింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు మహ్మద్ హఫీజ్, నాసిర్ జంషెడ్ శతకాలు బాదడం వల్ల నిర్ణీత 50 ఓవర్లలో 329 పరుగులు చేసింది. 330 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన భారత్‌కు తొలి ఓవర్ లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ గంభీర్‌ను ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన విరాట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 148 బంతుల్లో 183 పరుగులు బాదాడు. అందులో 22 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. దీంతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కోహ్లీకి దక్కింది. అంతేకాకుండా వన్డేల్లో కోహ్లీ బెస్ట్ స్కోరు ఇదే కావడం గమనార్హం.
శ్రీలంకపై విధ్వంసం
2012 ఫిబ్రవరిలో జరిగిన కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్‌లో శ్రీలంకతో భారత్ తలపడింది. ఈ మ్యాచ్‌లో లంకేయులు నిర్ణీత 50 ఓవర్లలో 320 పరుగులు చేశారు. ఈ ట్రై సిరీస్‌లో టీమ్ఇండియా ఫైనల్ చేరాలంటే 40 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాలి. దీంతో భారత్ దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించింది. ఈ క్రమంలో 86 పరుగులకే ఓపెనర్లు సచిన్, సెహ్వాగ్ వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ 16ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 82 బంతుల్లో 133 పరుగులు బాదాడు. దీంతో టీమ్ఇండియా సునాయాశంగా విజయం సాధించింది.
ఆసీస్ పై టీ20లో దూకుడు
2016లో మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో భారత జట్టు టీ20 మ్యాచ్ ఆడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 160 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో టీమ్ ఇండియా తడబడింది. 8 ఓవర్లలో కేవలం 49 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో కోహ్లీ అద్భుతంగా ఆడాడు. 51 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 82 రన్స్ చేశాడు. దీంతో ఆసీస్ ను భారత్ ఓడించింది.