Vinesh Phogat Paris Olympics:పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడడంపై దేశవ్యాప్తంగా పలువురు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. వినేశ్‌పై అనర్హత వేటుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై భారత బాక్సర్ విజేందర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. దీన్ని విధ్వంసకర చర్యగా అభివర్ణించాడు. వినేశ్ వంటి ఎలైట్ అథ్లెట్లకు ప్రధాన పోటీలకు ముందు బరువు ఎలా తగ్గాలో తెలుసని పేర్కొన్నాడు.
'ఒకవేళ అథ్లెట్ కాస్త అధిక బరువు ఉంటే స్టీమ్ బాత్, రన్నింగ్, డైట్ వల్ల దానిని తగ్గించవచ్చు. కానీ, ఫైనల్‌కు ముందు కేవలం 100 గ్రాముల బరువు ఉన్నట్లు చెబుతూ అనర్హత వేటు వేయడం సరైన చర్య కాదు. బరువు తగ్గించుకోవడానికి బాక్సర్లకు సమయం ఇస్తారు. అథ్లెట్లు రాత్రిపూట 5- 6 కిలోల బరువు తగ్గించగలరు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆకలి, దాహాన్ని ఎలా నియంత్రించాలో అథ్లెట్లకు బాగా తెలుసు' అని విజేందర్ వ్యాఖ్యానించాడు.
'భారతీయుల హృదయాల్లే మీరే ఛాంపియన్'
పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫొగాట్ చేసిన అసాధారణ విన్యాసాలు ప్రతి భారతీయుడిని ఉర్రూతలూగించాయని, దేశాన్ని గర్వించేలా చేశాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిప్రాయపడ్డారు. వినేశ్‌పై అనర్హత నిరాశ పరిచినప్పటికీ, ఆమె 140 కోట్ల మంది భారతీయుల హృదయాల్లో ఛాంపియన్‌గా మిగిలిపోయారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు.
'వినేశ్‌కు అండగా ఉన్నాం'
వినేశ్ ఫొగాట్‌కు కోచ్, సహాయ సిబ్బందిని నియమించామని కేంద్ర క్రీడా మంత్రి మన్ సుఖ్ మాండవీయ లోక్ సభలో వెల్లడించారు. ఆమెకు ఫిజియోథెరపిస్ట్ కూడా ఉన్నారని గుర్తు చేశారు. వినేశ్ గతంలో అనేక విజయాలు సాధించిందని కొనియాడారు. వినేశ్ ఫొగాట్‌కు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలిచిందని, ఆమెకు అత్యుత్తమ శిక్షణ తీసుకునేలా సాయపడ్డామని వివరించారు. ఫొగాట్ అనర్హతపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉషను ఆదేశించారని పేర్కొన్నారు. ఫొగాట్ పై అనర్హత వేటుపై జీరో అవర్‌లో ప్రభుత్వం ప్రకటన చేయాలని విపక్షాలు పార్లమెంట్లో డిమాండ్ చేశాయి. ఈ విషయంపై క్రీడా మంత్రి సమాధానం చెప్పాలని నినాదాలు చేశాయి. ఈ మేరకు మన్సుఖ్ మాండవీయ వినేశ్ ఫొగాట్ అనర్హత అంశంపై ప్రకటన చేశారు.