Vinesh Phogat CAS Verdict:భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అప్పీలుపై మరోసారి కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) తీర్పును వాయిదా వేసింది. శుక్రవారం రాత్రి 9.30 గంటల్లోపు వెల్లడిస్తామని పేర్కొంది. అయితే వినేశ్ అప్పీలుపై తీర్పు ఆలస్యం అవుతుండడం వల్ల సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తీర్పు ఎందుకు వాయిదా పడుతుందో అర్థంకావడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
'వినేశ్ ఫొగాట్ కేసు తీర్పును కాస్ మళ్లీ వాయిదా వేసింది. దీనిని చూస్తుంటే సినిమాల్లో కోర్టుల్లాగా రోజూ వాయిదా పడే సన్నివేళాలు గుర్తుకొచ్చాయి' అంటూ ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని చెప్పారు. ఇక 'పతకం ఇవ్వాలని లేదా ఏంటీ?', 'సీరియస్ సమస్య కాస్త ఓ జోక్‌లా అయిపోయింది!','ఇలా వాయిదా వేస్తూ పోతుంటే తీర్పు ఏమిచ్చినా ఎవరూ పట్టించుకోరని కాస్ భావిస్తున్నట్లుంది. వినేశ్‌కు న్యాయం జరగాల్సిందే', 'డైలీ సీరియల్లా సాగిస్తున్నారు' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
'వాయిదాలమీద వాయిదాలు!'
తాజాగా తీర్పు మరోసారి వాయిదా పడిన తర్వాత వినేశ్ పెదనాన్న మహావీర్ ఫొగాట్ కూడా స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వినేశ్‌ను ఛాంపియన్లాగే ఎదుర్కొంటాం అని మహావీర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 'గత 5- 6 రోజులుగా తీర్పు కోసం ఎదురుచూస్తున్నాం. ఫలితం వస్తుందనుకుంటే, వాయిదాలపై వాయిదాలే ఎదురవుతున్నాయి. కాస్ తీర్పు కోసం ఎదురుచూస్తున్నాం. వాళ్ల తీర్పును అంగీకరిస్తాం. కాస్ జడ్జిమెంట్ అనుకులంగా వస్తుందని ఆశతో 140కోట్ల భారతీయులు ఎదురుచూస్తున్నారు. ఆమె పారిస్ నుంచి రాగానే, ఛాంపియన్లాగే వినేశ్‌కు స్వాగతం పలుకుతాం' అని ఆయన అన్నారు.