Vinesh Phogat CAS Case :పారిస్ ఒలింపిక్స్‌లో తనపై విధించిన అనర్హతను సవాలు చేస్తూ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ చేసిన అభ్యర్థనను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ తాజాగా తిరస్కరించింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే ఈ కేసును ఇప్పటికే మూడు సార్లు వాయిదా వేయగా, తుది తీర్పు కోసం వెయిట్ చేసిన క్రీడాభిమానులకు నిరాశే మిగిలింది.
"యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ విధించిన అనర్హతను సవాలు చేస్తూ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ చేసిన అప్పీల్‌ను కాస్ తిరస్కరించడం నన్ను దిగ్భ్రాంతికి అలాగే నిరాశకు గురిచేసింది. సిల్వర్ మెడల్ ఇవ్వాలని వినేశ్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చుతూ కాస్ ఆగస్టు 14న తీర్పును ఇచ్చింది" అని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే వినేశ్ అప్పీలుపై తీర్పు ఆలస్యం అవుతుండడం వల్ల సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తీర్పు ఎందుకు వాయిదా పడుతుందో అర్థంకావడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. 'వినేశ్ ఫొగాట్ కేసు తీర్పును కాస్ మళ్లీ వాయిదా వేసింది. దీనిని చూస్తుంటే సినిమాల్లో కోర్టుల్లాగా రోజూ వాయిదా పడే సన్నివేళాలు గుర్తుకొచ్చాయి' అంటూ ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని చెప్పారు. ఇక 'పతకం ఇవ్వాలని లేదా ఏంటీ?', 'సీరియస్ సమస్య కాస్త ఓ జోక్‌లా అయిపోయింది!','ఇలా వాయిదా వేస్తూ పోతుంటే తీర్పు ఏమిచ్చినా ఎవరూ పట్టించుకోరని కాస్ భావిస్తున్నట్లుంది. వినేశ్‌కు న్యాయం జరగాల్సిందే', 'డైలీ సీరియల్లా సాగిస్తున్నారు' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు.