Youngest Player IPL Auction 2025: ఐపీఎల్ ఇప్పటివరకు అనేక రికార్డులు, అద్భుతాలు నమోదు అవ్వడం చూశాం. అయితే క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలోనే ఈసారి ఓ వండర్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేంటో కాదు, 2025 మెగా వేలంలో ఓ 13ఏళ్ల కుర్రాడు తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. అంతేకాకుండా ఐపీఎల్ బోర్డు షార్ట్ లిస్ట్ చేసిన ప్లేయర్ల లిస్ట్‌లో ఆ కుర్రాడి పేరు కూడా అందులో ఉంది. రూ.30 లక్షల బేస్‌ప్రైజ్‌తో ఆ కుర్రాడు వేలంలో దిగనున్నాడు. దీంతో అంత చిన్న కుర్రాడిని వేలానికి ఎంపిక చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక ఈసారి అతడిని ఏ ఫ్రాంచైజీ దక్కించుకున్నా అది సంచలం కానుంది. మరి ఆ కుర్రాడు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చాడ? అన్న ప్రశ్నలు క్రికెట్ అభిమానుల్లో మెదులుతున్నాయి.
అతడే సూర్యవంశీ
బిహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ 2011లో జన్మించాడు. అంటే ప్రస్తుతం అతడి వయసు 13ఏళ్లు. తాజ్‌పుర్ గ్రామానికి చెందిన వైభవ్ నాలుగేళ్ల వయసులోనే బ్యాట్ పట్టాడు. చిన్న వయసులోనే కుమారుడికి క్రికెట్‌పై ఇష్టాన్ని గ్రహించిన వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ ప్రత్యేకంగా మైదానాన్ని తయారు చేయించాడు. మరో నాలుగేళ్లకే సమస్తిపుర్‌లోని క్రికెట్ అకాడమీలో చేర్పించాడు.
అక్కడ రెండేళ్లపాటు శిక్షణ పొందిన అతడు అండర్- 16 జట్టులోకి వచ్చేశాడు. అప్పటికి వైభవ్ వయసు కేవలం 10 ఏళ్లే కావడం గమనార్హం. ఆ వయసులోనే బిహార్ స్టేట్ లెవెల్ టోర్నీ అన్నింట్లోనూ వైభవ్ అదరగొట్టాడు. ఆ తర్వాత వినూ మన్కడ్ టోర్నీలో రాణించాడు. దీంతో బిహార్ క్రికెట్ బోర్డు దృష్టి ఆకర్షించాడు. అలా 2024లోనే బిహార్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత టీమ్ఇండియా అండర్ 19 జట్టుకు కూడా ఎంపికయ్యాడు. ప్రస్తుతం 2024-25 రంజీలోనూ ఆడుతున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటరైన వైభవ్ దూకుడుగా ఆడడం అతడి స్పెషల్.