Teamindia Marine Drive T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన టీమ్ఇండియా ముడు రోజుల తర్వాత తిరిగి స్వదేశానికి చేరుకుంది. ఈ సందర్భంగా టీమ్ఇండియా క్రికెట్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని క్రికెటర్లకు ఘన స్వాగతం పలికారు. స్వదేశానికి రాగానే భారత క్రికెటర్లంతా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
ప్రస్తుతం ముంబయిలోని విక్టరీ పరేడ్‌లో పాల్గొన్నారు. ముంబయిలోని మెరైన్ డైవ్ నుంచి ఈ రోడ్ షో మెుదలైంది. ఓపెన్ టాప్ బస్సులో పైకి ఎక్కిన ఆటగాళ్లు అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు. దీంతో ఈ పరేడ్ కోసం ముంబయి వీధుల్లో లక్షలాది మంది అభిమానులు గుమిగూడారు. ర్యాలీ మెుదలయ్యే నారిమన్ పాయింట్ వద్దకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ చేరుకుని సందడి చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలోని రోడ్డు మెుత్తం అభిమానులతో కిక్కిరిసిపోయింది. జై భారత్ నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తుతోంది.
భారీ బందోబస్త్ - క్రికెట్ అభిమానులతో ముంబయి సముద్రతీరం పోటెత్తింది. ప్రపంచకప్ హీరోలకు స్వాగతం పలికేందుకు భారీగా రోడ్లపైకి అభిమానులు చేరుకోవడంతో పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీ జరిగే ప్రాంతమంతా పోలీసు యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. అటు వాంఖడే స్టేడియం వద్ద పోలీసు ఉన్నతాధికారులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. రోడ్‌షో సాగే మార్గంలోనూ భారీగా పోలీసులు మోహరించారు.
కాగా, 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడిన భారత్ మళ్లీ 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇప్పుడు పొట్టి కప్పును గెలుచుకుంది. దాదాపు 11 ఏళ్ల విరామం తర్వాత ఐసీసీ కప్పును చేజిక్కుంచుకుంది. చివరిసారిగా 2013లో ఐసీసీ ఛాంఫియన్స్ ట్రోఫీని భారత్ ముద్దాడింది. అటు 2007లో తొలి టీ20 గెలిచినప్పుడు బీసీసీఐ ర్యాలీ నిర్వహించింది. 2011 వన్డే ప్రపంచకప్ విజేతగా అయినప్పుడు ర్యాలీ నిర్వహించాల్సి ఉన్న ప్రపంచ కప్ జరిగిన ఐదు రోజులకే ఐపీఎల్ మెుదలవ్వడంతో రోడ్‌షోను రద్దు చేసింది. దీంతో 17 ఏళ్ల తర్వాత బీసీసీఐ విజయోత్సవ ర్యాలీ చేపట్టింది.