Meenakshi Chaudhary Sankranthiki Vasthunnam : యంగ్ టాలెంటెడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి కీలక పాత్ర పోషించిన లేటెస్ట్ సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'. దగ్గుబాటి వెంకటేశ్ హీరోగా, అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. ఐశ్వర్యా రాజేశ్ మరో హీరోయిన్. 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మీనాక్షి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మరి ఈ సినిమా గురించి ఆమె మాటల్లో!
గతేడాది కూడా
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది. కామెడీ జానర్ సినిమాలో నటించడం ఇదే తొలిసారి. యాక్షన్ సీక్వెన్స్ చేయడం కూడా ఇదే ఫస్ట్‌టైమ్. వినోదాత్మకంగా సాగే పోలీసు రోల్ ప్లే చేయడం కొత్త అనుభూతి. గతేడాది కూడా నేను నటించిన 'గుంటూరు కారం' సంక్రాంతికే రిలీజైంది. ఇప్పుడు 'సంక్రాంతికి వస్తున్నాం'తో వస్తున్నాం.ఈ జర్ని ఓ కలలా అనిపిస్తోంది. నాపై నమ్మకం ఉంచి అవకాశాలు ఇచ్చిన దర్శక- నిర్మాతలకు ధన్యవాదాలు'
ఆ పాత్ర చేయాలని
'పోలీసు పాత్రలో నటించాలనేది ఓ కల. కెరీర్ ప్రారంభంలోనే ఆ ఛాన్స్ దక్కింది. ఈ పాత్ర కోసం ఎలాంటి రిఫెరెన్స్ తీసుకోలేదు. మా నాన్న ఆర్మీ ఆఫీసర్. ఆయన బాడీ లాంగ్వేజ్‌పై నాకు అవగాహన ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కాస్త హోమ్ వర్క్ చేశా. వెంకటేశ్ సర్ మంచి వ్యక్తి. అందర్నీ నవ్విస్తూ ఉంటారు. ఆయన కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఐశ్వర్య మంచి నటి. ఆమె నటించిన సినిమాలు చూశా. పాజిటివ్‌గా ఉంటారు. తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా'
వాటిలాగే ఇదీ హిట్టే
'ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. నేను నటించిన సినిమాలో ఇలా అవ్వడం ఇదే తొలిసారి. 'గోదారి గట్టు మీద', 'మీను' సాంగ్స్‌కు విశేష ఆదరణ దక్కింది. భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. పాటల్లాగే సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నా. కొత్త ఐడియాలతో సినిమాని ప్రమోట్ చేస్తున్నాం. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. కామెడీతోపాటు అన్ని ఎమోషన్స్ ఉంటాయి'
నెక్ట్స్ ప్రాజెక్ట్స్
'మా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా 'అన్‌స్టాపబుల్' షోలో బాలకృష్ణ సర్‌ని కలిశా. ఆయన వన్ అండ్ ఓన్లీ OG. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో 'అనగనగ ఒక రాజు' చేస్తున్నా. ఇంకా నేను ఒప్పుకున్న మరో రెండు సినిమాల వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటిస్తారు' అని తెలిపారు.
5 సినిమాల్లో ఒక్కటే హిట్ - 'విక్టరీ' జోడీగానైనా మీనాక్షి విజయం అందుకుంటుందా?