Gujarat Rain Floods Radha Yadav : గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గడిచిన మూడు, నాలుగు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోయాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరద నీరు పోటెత్తడం వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా చోట్ల కనీస అవసరాలకు నోచుకోని దారుణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిసింది.
ముఖ్యంగా వడోదరలో వర్షం కాస్త తెరిపించ్చినప్పటికీ అక్కడి విశ్వామిత్ర నది పొంగి పొర్లుతుండటం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నది పక్కనే ఉన్న చాలా ఇళ్లు నీట మునిగాయి. అలా ఈ వరదల్లో చాలా కుటుంబాలు చిక్కుకున్నాయి. వారిలో భారత మహిళా క్రికెటర్ స్పిన్నర్ రాధా యాదవ్ ఫ్యామిలీ కూడా ఉంది. దీంతో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్‌డీఆర్ఎఫ్) బృందాలు మిగితా వారితో పాటు రాధా యాదవ్ కుటుంబాన్ని రక్షించాయి. సురక్షితమైన ప్రాంతానికి తరలించాయి.
Radha Yadav Gujarat Floods :ఈ విషయాన్ని రాధా యాదవ్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపింది. అక్కడి దృశ్యాలను షేర్ చేసింది. "వడోదరలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మేమంతా అందులోనే చిక్కుకుపోయాం. విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న మా కుటుంబాన్ని రక్షించిన ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలకు ప్రత్యేక ధన్యవాదాలు" అని రాధా యాదవ్ తన పోస్టులో రాసుకొచ్చింది.