TEAM INDIA SECRET TRAINING CAMP : స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన టీమ్ ఇండియా ఇప్పుడు మరో కీలక సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ప్రతిష్టాత్మక బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ కోసం రెడీ అయింది. ఇందుకోసం ఇప్పటికే భారత జట్టు ఆస్ట్రేలియాకు చేరుకుంది. అయితే ఈ ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాలో భారత్ ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడట్లేదు. అయినా కూడా ఈ సిరీస్ ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న టీమ్ఇండియా ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది.
సీక్రెట్‌గా క్యాంప్‌లో -రెండుసార్లు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) రన్నరప్‌గా నిలిచిన టీమ్ ఇండియా మరోసారి ఫైనల్ చేరాలని కసిగా ఉంది. టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు ముందు కీలక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది. ఆస్ట్రేలియాలో వరుసగా రెండు ట్రోఫీలు గెలిచిన భారత్, హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. దీనికోసం ఆస్ట్రేలియాకు రెండు బ్యాచ్‌లుగా వెళ్లిన భారత జట్టు, ఇప్పుడు సీక్రెట్ క్యాంప్‌లో ట్రైనింగ్ ప్రారంభించింది.
ఐదు మ్యాచ్‌ల సిరీస్ భాగంగా తొలి మ్యాచ్ నవంబర్ 22 నుంచి పెర్త్‌లో ప్రారంభం అవుతుంది. అయితే తొలి మ్యాచ్‌లో గెలుపొందేందుకు భారత క్రికెటర్లు పెర్త్‌లో సీక్రెట్ క్యాంప్‌లో ట్రైనింగ్ పొందుతున్నట్లు 'ది వెస్ట్ ఆస్ట్రేలియన్' నివేదిక పేర్కొంది. ఆప్టస్ స్టేడియం ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఉందని, ప్రాక్టీస్ సెషన్‌లను ప్రజలు వీక్షించేందుకు అవకాశం లేదని వెల్లడించింది.WACA మైదానంలో భారత జట్టు సీక్రెట్ క్యాంప్ ఏర్పాటు చేసుకుని మరీ సిరీస్‌కు సన్నద్దమవుతున్నట్లు ఆస్ట్రేలియా మీడియా తెలిపింది.
కఠినమైన ఆంక్షలు -భారత్ ప్రాక్టీస్ సెషన్‌లను ప్రైవేట్‌గా ఉంచారు. ప్రాక్టీస్ సెషన్లో ఫోన్‌ల వినియోగంపై, సహాయ సిబ్బందికి కఠిన ఆంక్షలు విధించారట. టీమ్ స్ట్రాటజీలు, శిక్షణా పద్ధతులు గోప్యంగా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. బయటి వ్యక్తులు ఫొటోలు, వీడియోలు తీయకుండా ఉండేందుకు నెట్స్‌తో ప్రాక్టీస్ చేస్తున్న ఏరియాను కవర్ చేశారు. అయినా కూడా కొంతమంది చాటుగా భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ప్రాంతానికి వెళ్లి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.